నేనేమీ సాధించలేనా?

 20-07-2017: జీవితంలో పెద్దగా ఏదో సాధించాలని దాదాపు టీనేజ్‌నుంచి అనుకుంటూ వచ్చిన వాణ్ని. నాకిప్పుడు 39 ఏళ్లు కానీ, ఇంతవరకూ సాధించేదేమీ లేదు. మిగిలిన ఆ సగం జీవితం కూడా ఇలాగే నిరర్ధకంగా, నిష్పలంగా గడిచిపోతుందేమోనన్న భయం ఇటీవలి కాలంలో నన్ను తీవ్రంగా వేధిస్తోంది. నా లోపం ఎక్కడుందో... నేను ఎక్కడ విఫలమవుతున్నానో నాకేమీ తెలియడం లేదు. నేను ఏం చేయాలో చెప్పండి?

-ఎస్‌. ప్రదీప్‌, రాజమండ్రి
 
జవాబు: వాస్తవానికి, మీరు అనుకోవడంలోనే అతిపెద్ద లోపం ఉంది. ఏదో ఒకటి సాధించాలనే గాలి ఆలోచనే తప్ప, ఏ రంగంలో, ఏ విషయానికి సంబంధించి ఏం సాదించాలనుకుంటున్నారో ఒక స్పష్టత లేదు. ఇలా ఉంటే 40 ఏళ్లు కాదు, ఇంకో 400 ఏళ్లయినా మీరు సాధించేదేమీ ఉండదు. ముందు, పలానా రంగానికి సంబంధించిన ఫలానా అంశంలో పలానా లక్ష్యాన్ని సాధించాలని పక్కాగా అనుకోండి. అప్పుడే మీరు ఆ రంగానికి సంబంధించిన అధ్యయనం మొదలెడతారు. ఆ తర్వాత ఆ రంగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆ రంగంలో విజయాన్ని సాధించివారిని, విఫలమైన వారినీ కలుస్తారు. వారి అనుభవాలను తెలుసుకుంటారు. స్వతంత్రంగా ఆలోంచడం మొదలెడతారు. ఆ తర్వాత ఎవరో ఏదో చెప్పాల్సిన అవసరంలేదు దానికి సంబంధించిన కార్యచరణ పథకమంతా మీ కళ్లముందే నిలుస్తుంది. అయినా టీనేజ్‌ నుంచి మొదలుకుని ఇప్పటిదాకా దాదాపు 20 ఏళ్లుగా మీ ఒక్క అడుగైనా విజయ పథంగా పడలేదూ అంటే, మీరు ఆ విషయంలో పెద్ద సీరియస్‌గా లేరని తేలిపోతోంది. సమాజంలో నాన్‌సీరియస్ వ్యక్తులు సాధించేదేమీ ఉండదు. ఏదో సాధించాలనే కలలు ఎవరికైనా ఉండాల్సిందే. కానీ ఆ కలలు ఎలా ఉండాలి? అబ్దుల్‌ కలామ్‌ అన్నట్లు ‘‘నిద్రలో వచ్చే కలల్లాంటివి కాదు, నిద్రపట్టనివ్వని కలలు’’ కావాలి. గాలి బుడగల్లాంటి లక్ష్యాలు గాలిలోనే కొట్టుకుపోతాయి. లక్ష్యాలు అనుక్షణం గుండెల్ని దహించేవిగా ఉండాలి. అప్పుడే వాటికోసం అహోరాత్రులు పాటుపటే దీక్షాదక్షతులు మనకు తెలియకుండానే మనలోంచి ఎగిసిపడతాయి. ఈ విషయాలు అలా ఉంచితే అనేకానేక వైఫల్యాల వెనుక అస్పష్టతే ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. మీరు సాధించాలనుకునే విషయానికి సంబంధించిన మీ అస్పష్టత నుంచి ముందు బయటపడండి. అప్పుడే మీ దారి సుగమం అవుతుంది. మీ లక్ష్యం మీ చేరువవుతుంది.
- డాక్టర్‌ ఎన్‌ సుధామూర్తి
కన్సల్టెంట్‌ సైకాలజిస్ట్‌