ఐటీ ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్న ‘పారనోయా’

ఆంధ్రజ్యోతి(23-10-2016): ఐటీ కంపెనీల ఉద్యోగులకు ఇప్పుడో పెద్ద కష్టం వచ్చిపడింది. అమెరికా నుంచి వారి మనసులను ఎవరో రహస్యంగా నియంత్రిస్తున్నారు. సాధారణంగా ఇటువంటివి సైన్స్ ఫిక్షన్ కథల్లోనో, హాలీవుడ్ సినిమాల్లోనో ఇటువంటివి కనిపిస్తాయి. కానీ ఇప్పుడిది ఐటీ రాజధాని అయిన బెంగళూరుకు పాకింది. తమ మనసులను ఎవరో నియంత్రిస్తున్నారంటూ ఎంతోమంది టెక్కీలు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక టెక్కీల ఫిర్యాదులను బట్టి చూస్తే వారు ‘పారనోయా’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదో భావన మాత్రమేనని వారు పేర్కొన్నారు.
 

తన మనసును యూఎస్ ఫెడరల్ పోలీసులు నియంత్రిస్తున్నారంటూ ఇటీవల మహిళా ఐటీ ఉద్యోగి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది. ‘‘మొదట్లో ఆమె తమ వద్దకు వచ్చినప్పుడు తన మాజీ భర్త అమెరికాలో ఉన్నట్టు చెప్పింది. దీంతో భర్తతో ఆమెకేవైనా ఆస్తివివాదాలు ఉన్నాయోమోనని ఆరా తీస్తే అటువంటివి ఏమీ లేవని తేలింది. దీంతో ఆమె పారనోయాతో బాధపడుతున్నట్టు గుర్తించాం’’ అని కర్ణాటక మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ మీరా సక్సేనా పేర్కొన్నారు. ఇటువంటి కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నట్టు సక్సేనా తెలిపారు.

రిటైర్డ్ సూపర్ కాప్ కేపీఎస్ గిల్ తన మెదడులో ఓ చిప్ అమర్చి తనను నియంత్రిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. గిల్ తన మెదడును చాలారోజులుగా నియంత్రిస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఇంకో కేసులో తమిళనాడు పోలీసులను తన ఆలోచనను నియంత్రిస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. ఇటువంటి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(నిమ్హాస్) డైరెక్టర్ బీఎన్ గంగాధర్ మాట్లాడుతూ.. పారానాయిడ్‌తో బాధపడుతున్న వారు నిజ జీవితంలో జరిగిన సంఘటనలను లేదంటే చదివిన, విన్న ఘటనలను గుర్తుకు తెచ్చుకుని బయపడుతుంటారని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టించి నియంత్రిస్తున్నారంటూ వచ్చిన ఓ వ్యక్తికి సైకియాట్రిస్ట్ కన్నన్ జీకే చికిత్స అందించారు. పారనోయాపై ఆయన మాట్లాడుతూ అన్ని కేసులూ పారానోయాకు సంబంధించినవి కావని పేర్కొన్నారు. దానిని ఓ మానసిక రుగ్మతగా కూడా చెప్పవచ్చని తెలిపారు. ఐటీ కంపెనీల్లో ఇటీవల ఇటువంటి రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన వివరించారు. నిత్యం ఒకే రకమైన విషయాలను చర్చించే వారిలోనూ పారానోయా సమస్యలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నవారిలోనూ ఇటువంటి పారనోయా బయటపడే అవకాశం ఉందని కన్నన్ తెలిపారు.