ఉద్వేగ సమస్యలకు కలర్‌ థెరపీ

ఆంధ్రజ్యోతి, 15/05/2014: కలర్‌ థెరపీ ఈజిప్టులో పుట్టిందని చెప్తారు. ప్రాచీన కాలంలో కూడా ఈ కలర్‌ థెరపీని ఉపయోగించినట్టు పరిశోధకులు చెప్తున్నారు. రంగులు, వెలుగుపై విస్తృతంగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు రంగులు వ్యక్తులలో భావోద్వేగమైన ప్రతిస్పందనలు కలిగిస్తాయనీ, ఒక రంగు పట్ల అందరి స్పందన ఒకేలా ఉండదనీ వారు చెబుతున్నారు. కొన్ని రంగులు సానుకూల భావాలను, కొన్ని రంగులు ప్రతికూల భావాలను కలిగిస్తాయి. వీటిని అధ్యయనం చేసినవారే కలర్‌ థెరపీ చేస్తారు. మనం ఎంచుకునే రంగులు కూడా మన వ్యక్తిత్వాన్ని కొంత వరకు వ్యక్తపరుస్తాయి. కొన్ని రకాల రంగుల దుస్తులు మన మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలనే కలర్‌ థెరపిస్టులు వెల్లడిస్తున్నారు.
 
ఎరుపు రంగు: ఇది ఉత్తేజకరమైన రంగు. ధైర్యం, బలం, ఉల్లాసం, లక్ష్యం, అప్రమత్తత, లైంగిక, సృజనాత్మక వంటి లక్షణాలకు ఎరుపు రంగు సంకేతం లాంటిది. అంతేకాదు ఈ రంగు ఆకలిని పెంచుతుంది. ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం అసహనం, శత్రుత్వ భావన, చిరాకు వంటి లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. ఆరెంజ్‌ రంగు: ఈ రంగు మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేయగలదు. కలుపుగోలుతనం, విశ్వాసంగా ఉండటం, సంతోషం, విజయం వెంటే ఉండేలా ప్రభావితం చేస్తుంది. యాంటీ డిప్రెసెంట్‌గా కూడా పనిచేస్తుందని కలర్‌ థెరపిస్టులు చెబుతున్నారు. ఈ రంగు కూడా అతిగా వాడే వారిలో అసహనం, చిరాకు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
 
పసుపు పచ్చ రంగు: ఎక్కువ స్థాయిలో ఉత్తేజాన్నిచ్చే రంగు ఇది. సానుకూల వైఖరి,ఆత్మగౌరవం, వివేకం, స్ఫూర్తికి సంకేతం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడం, ఆందోళన నుంచి బయటపడటం వంటివి ఈ రంగు వల్ల సాధ్యం అవుతుందని థెరపిస్టులు చెబుతున్నారు.
 
ఆకుపచ్చ రంగు: ఇది నూతనోత్సాహాన్ని, శాంతినిచ్చే రంగు. ప్రేమ, ఆశ, సామరస్యం, స్వీయ నియంత్రణ వంటి అంశాలకు సంకేతం. ఈ రంగును ఎక్కువగా ఉపయోగించేవారిలో ఒత్తిడి తగ్గడం, విశ్రాంతి వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని థెరపిస్టులు వెల్లడిస్తున్నారు. అయితే, ఆకుపచ్చ రంగును అతిగా వాడితే బద్ధకం పెరుగుతుందనీ వారు అంటున్నారు.

లేత నీలం రంగు: ఈ రంగు ప్రశాంతతకు చిహ్నం. భావవ్యక్తీకరణకు సంకేతంగా భావించవచ్చు. స్వచ్ఛత, ఓదార్పు, ఆత్మవిశ్వాసం, అనర్గళంగా, నిర్మొహమాటంగా మాట్లాడటం వంటి లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. గా ఉంటాయి. ఈ రంగును ఎక్కువగా వాడినా ఎలాంటి దుష్రభావాలకూ లోనుకాకపోవడం విశేషం.

నీలం రంగు: ఇది సంపూర్ణ ఆలోచనలతో అనుసంధానం అయి ఉండే రంగు. సృజనాత్మకత, వ్యక్తీకరణ, ఉత్తేజం, ఆరోగ్యం వంటి లక్షణాలకు ఈ రంగు సంకేతం. పిల్లల్లో హైపర్‌ యాక్టివ్‌ తగ్గేందుకూ సహాయపడుతుంది. చాలా పాఠశాలల్లో నీలం రంగు యూనిఫామ్‌ ఉపయోగించడానికి ఇది ఒక కారణం కావచ్చు. అయితే, నీలం రంగును అతిగా ఉపయోగిస్తే అభద్రత, నిరాశ, అలసట, ఉదాసీనత ఏర్పడవచ్చని థెరపిస్టులు హెచ్చరిస్తున్నారు.
 
వయొలెట్‌ రంగు: ఇది ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అనుసంధానంగా ఉండే రంగు. స్ఫూర్తి, సృజనాత్మకత, అందం వంటి వాటికీ అనుసంధానంగా ఉంటుంది. ఈ రంగును ఎక్కువగా ఉపయోగించే వారిలో గాఢనిద్ర, చిరాకు, అతి ఆకలి తగ్గుతాయి. ఈ రంగును అతిగా వాడితే ఉద్వేగాలను ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలు పెరిగిపోతాయని థెరపిస్టులు చెబుతున్నారు.
 
మెజెంటా: ఈ రంగు ఓదార్పు, సున్నితత్వం వంటి భావాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును వాడటం వల్ల అంతర్గత, బహిర్గత ఉద్వేగాలు బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతారు. నలుగురితో కలువలేని వారికి, డిప్రెషన్‌లో ఉన్నవారికి ఈ రంగు వాడకం ఎంత మాత్రమూ మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
పరికరాలు ఇవే... 
కలర్‌ థెరపీలోఉపయోగించే పరికరాలు ఏమిటంటే...రత్నాలు, కొవ్వొత్తులు, దీపాలు, క్రిస్టల్‌ దండం, క్రిస్టల్‌, రంగు బట్టలు, రంగునీటితో స్నానపు చికిత్స, రంగు కళ్లజోళ్లు, లేజర్లు. కలర్‌ థెరపీలో ఈ పరికరాలను ప్రధానంగా ఉపయోగిస్తారు. కలర్‌ థెరపిస్ట్‌లు అధ్యయనం చేసే విషయాల్లో మనిషిపై రంగుల ప్రభావాలు తెలుసుకోవడమే ప్రధానాంశం. ఆ అంశాల ఆధారంగానే ఽథెరపిస్టులు చికిత్స అందిస్తుంటారు. 

అనేక అనారోగ్యాల నుంచి బయటపడేందుకు వైద్యరంగంలో కొన్ని కొన్ని థెరపీలున్నాయి. వాటన్నిటిలో ఆసక్తి రేపుతున్నది కలర్‌ థెరపీ! థెరపీ అంటేనే ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇప్పుడు అలాంటి వైద్యవిధానాల్లో కలర్‌ థెరపీకి ప్రాముఖ్యం పెరిగిపోతోంది. ఇంద్రధనసులో కనిపించే సహజ రంగులన్నింటికీ స్వస్థత చేకూర్చే గుణాలున్నాయి. అసలు సూర్యరశ్మి లేకుండా జీవరాశులే లేవు. వెలుతురు లేకుంటే మనుషులు డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదమూ ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే కలర్‌ థెరపీ ప్రాక్టీస్‌ చేసేవారు రంగులతో పాటు వెలుతురును కూడా తమ పరికరాలుగా ఉపయోగిస్తూ స్వస్థత చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. కలర్‌ థెరపీ భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.