కమాండర్‌ కాలేయం

రేపు ‘వరల్డ్‌ లివర్‌ డే’ 

ఆంధ్రజ్యోతి,18-4-2017: ఇంట్లోకొచ్చే దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు ఊడ్చి బయట పారేస్తాం. దాంతోపాటు ఇంటి శుభ్రతకు అవసరమైన పనులన్నీ చేస్తాం. ఇలా రెండు రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటేనే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. అనారోగ్యాలూ దరి చేరకుండా ఉంటాయి. ఇలాంటి బాధ్యతలే మన ఒంట్లోని ఓ అవయవం కూడా చేస్తుంది. ఒంట్లోకి చేరే విషాల్ని విరిచేసి బయటికి వెళ్లగొట్టడం, జీవక్రియలకు అవసరమైన హార్మోన్లను స్రవించి ఆరోగ్యాన్ని సంరక్షించటం...ఇలా రెండు కీలకమైన పనులు చేసే అతి పెద్ద ఆర్గాన్‌...‘కాలేయం’. అవయవం, గ్రంథి...ఇలా ద్విపాత్రల్ని, ద్వంద్వ బాధ్యతల్ని నిర్వర్తించే ఆర్గాన్‌ కూడా కాలేయం ఒక్కటే! ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, శరీరం మొత్తాన్ని సంరక్షిస్తూ ‘కమాండర్‌’లా పనిచేసే కాలేయం కూడా కొన్ని సందర్భాల్లో జబ్బు పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

 
కాలేయం సామర్ధ్యం, నిర్వర్తించే బాధ్యతలు ఎనలేనివి. ప్రమాదకరమైన రసాయనాలు ఎప్పటికప్పుడు వడగడుతూ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరానికి అత్యవసర సమయంలో శక్తిని అందించటం కోసం జీర్ణమైన ఆహారాన్ని గ్లూకోజ్‌ రూపంలో నిల్వ చేసుకునే శక్తి భాండాగారంగా పనిచేస్తుంది. అలాగే రక్తంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంచటంతోపాటు, అంటు వ్యాధులు, రుగ్మతలతో పోరాడుతుంది. ఇన్ని క్రియలు చేయగలిగే కాలేయానికున్న మరో గొప్ప లక్షణం! తనలోని కణాలను తానే వృద్ధి చేసుకోవటం. కాలేయంలో ముప్పావు వంతు భాగాన్ని తొలగించినా తిరిగి పూర్తిగా పెరుగుతుంది. అలాగే ముప్పావు వంతు భాగం దెబ్బతిన్నా ఉన్న పావు భాగంతోనే విధులన్నీ నిర్వర్తిస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం కూడా కొన్ని సందర్భాల్లో వ్యాధులకు గురవుతుంది. అవేంటంటే...
 
కాలేయానికి వచ్చే వ్యాధులు
ఫ్యాటీ లివర్‌: మద్యం అలవాటున్నా, లేకపోయినా ఈ వ్యాధి తలెత్తవచ్చు. మద్యం కారణంగా తలెత్తే ఈ రుగ్మతను ‘ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అని, కొవ్వుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తినడం మూలంగా వచ్చే రుగ్మతను ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అని అంటారు. ఈ రెండు సందర్భాల్లో కొలస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ కాలేయంలో పేరుకుపోయి రుగ్మత లక్షణాలు బయటపడతాయి. అయితే మొదటి రెండు దశల్లో ఈ వ్యాధికి చికిత్స చేయటం తేలిక. చివరి దశకు చేరుకుంటే లివర్‌ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశాలుంటాయి. అప్పుడు కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం.
సిరోసిస్‌: దెబ్బ తగిలితే, అది మానిన తర్వాత కూడా చర్మం మీద ఎలాగైతే మచ్చ మిగిలిపోతుందో అలాగే కాలేయానికి కూడా జరుగుతుంది. మద్యం, హెపటైటిస్‌ వైర్‌సలు, ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల వల్ల జబ్బు పడితే ఆ వ్యాధులు మానినా వాటి ఫలితంగా కాలేయం మీద మచ్చలు ఏర్పడతాయి. కాలేయం మృదువుగా కాకుండా గట్టిగా తయారవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘స్కారింగ్‌’ అంటారు. ఈ పరిస్థితే చివరకు ‘లివర్‌ సిరోసిస్’కు దారి తీస్తుంది.
హెపటైటిస్‌: అపరిశుభ్ర అలవాట్ల వల్ల హెపటైటిస్/ఎ సోకితే, శరీర ద్రవాలు, ఇంజెక్షన్ల ద్వారా హెపటైటిస్/బి, సి వైరస్‌లు  సోకుతాయి. ఇక హెపటైటిస్/ఇ కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకుతుంది. హెపటైటి్‌స/ఎ/బిలకు వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటన్నిటిలో హెపటైటిస్/సి అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఈ వ్యాధి నుంచి కాపాడే వ్యాక్సిన్‌ కూడా లేదు. కాబట్టి కామెర్ల లక్షణాలు కనిపించిన వెంటనే ఏ రకం వైరస్‌ సోకిందో నిర్థారించుకోవాలి.హెపటైటిస్‌/సి అని పరీక్షల్లో తేలితే సత్వర చికిత్స ప్రారంభించాలి. లేదంటే లివర్‌ ఫెయిల్యూర్‌కి దారితీయొచ్చు.
 
లివర్‌ క్యాన్సర్‌: కాలేయ కణాల్లోనే క్యాన్సర్‌ తలెత్తవచ్చు లేదా శరీరంలోని ఇతర భాగాల నుంచి క్యాన్సర్‌ కాలేయానికి సోకవచ్చు. స్టెరాయిడ్ల వాడకం, ముదిరిన హెపటైటిస్‌/సి, లివర్‌ సిరోసిస్‌ లివర్‌ క్యాన్సర్‌లకు దారి తీయొచ్చు. మద్యపానం అలవాటుండి హెపటైటిస్‌ సోకిన మధుమేహులకూ,హెపటైటిస్‌/సి సోకి ధూమపానం చేసేవారికీ కాలేయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
 
 కామెర్లలానే...! 
ఎక్కువ శాతం కాలేయ వ్యాధుల లక్షణాలు కామెర్లను పోలి ఉంటాయి. అవేంటంటే... 
కళ్లు, చర్మం పచ్చబడటం 
మూత్రం పసుపు పచ్చగా ఉండటం 
ఆకలి మందగించటం 
వాంతి వస్తున్నట్టు అనిపించటం 
నీరసం, నిస్సత్తువ 
కండరాల నొప్పులు 
అజీర్తి 
దురదలు  
కాలేయానికి చికిత్సలున్నాయి 
కాలేయానికి చికిత్స అనేది వ్యాధి దశను బట్టి ఉంటుంది. కాలేయం దెబ్బతిన్న తీరును బట్టి గ్రేడ్లుగా విభజించి చికిత్స చేస్తారు. కాలేయం సమర్ధంగానే పనిచేస్తూ సిరోసిస్‌కు చేరుకునే దశలో ఉంటే ఆ స్థితిని ‘గ్రేడ్‌ ఎ’గా పరిగణించాలి. సిరోసిస్‌కు మద్యమే కారణమైతే దాన్ని మానేయటం ద్వారా పరిస్థితిని సరిదిద్దవచ్చు. కాలేయ వ్యాధి ‘గ్రేడ్‌ బి’కి చేరుకున్నప్పుడే కామెర్ల లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశకు చేరుకున్నా అందుకు కారణమైన పరిస్థితులను చక్కదిద్ది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు చేయవచ్చు. ఇక చివరి దశ ‘గ్రేడ్‌ సి’. ఈ దశలో కాళ్ళ వాపు, పొట్టలోకి, ఛాతీలోకి నీరు చేరటంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ దశకు చేరుకుంటే కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం.
 
 కాలేయ ఆరోగ్యం కోసం ఆహారం
మనం తీసుకునే ప్రతి ఆహారం జీర్ణమయ్యాక కాలేయ పరీక్షకు వెళ్లాల్సిందే! ఆ ఆహారంలోని రసాయనాలు, వ్యర్థాలు, విషాలను కాలేయం హరిస్తుంది. ఒకవేళ మనం ఇలాంటి వ్యర్ధాలు, రసాయనాలు ఎక్కువగా కలిగి ఉండే ఆహారం తీసుకుంటే కాలేయం మీద అదనపు భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించటంతోపాటు కాలేయ సామర్థ్యాన్ని పెంచే పోషకాహారం, సమతులాహారం తీసుకోవాలి. ఇందుకోసం... కొవ్వులు తక్కువగా, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం మాంసాహారులు... గుడ్డులోని తెల్ల సొన, లేత మాంసం, చేపలు తీసుకోవచ్చు.
 
తాజా కూరగాయలు, పళ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. 
పొట్టు తీయని పిండితో చేసిన రొట్టెలు, పప్పు ధాన్యాలు, కొవ్వు తీసిన పాలు తీసుకోవాలి. 
పొట్టు తీయని పెసరపప్పు, కందిపప్పు వాడటం మంచిది. 
పీచు ఎక్కువగా ఉండే కూరగాయల వాడకం పెంచాలి. 
కృత్రిమ కొవ్వు పదార్థాలు కాలేయానికి హానికరం. కాబట్టి ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ మానేయాలి. 
కూల్‌డ్రింక్స్‌, ప్రిజర్వేటివ్స్‌ కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలి.  
కాలేయాన్ని దెబ్బతీసే అలవాట్లు.. అంశాలు
మనం రోజూ తినే కొన్ని పదార్థాలు, అలవాట్లు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉంటే చాలు. కాలేయ ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుంది.
పంచదార: నోటిని తీపి చేసే పంచదార కాలేయానికి చేదే! కాలేయం ఫ్రక్టోజ్‌ అనే చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. శుద్ధి చేసిన పంచదార, అధిక శాతం ఫ్రక్టోజ్‌లను ఆహారం ద్వారా తీసుకుంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. చక్కెర వాడకం గురించి చేసిన పరిశోధనల్లో ధూమపానం వల్ల ఎంత ఆరోగ్య నష్టం కలుగుతుందో చక్కెర అధికంగా వాడటం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుందని తేలింది. కాబట్టి పంచదార వాడకం తగ్గించాలి.
ఎ విటమిన్‌ సప్లిమెంట్లు: విటమిన్‌ ఎ ను ఆహారం ద్వారా అందేలా చూసుకోవాలి. సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటే ఆ ప్రభావం కాలేయం మీద పడి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆహారం ద్వారా ఎంత ఎ విటమిన్‌ అందుతుందో తెలుసుకుని అవసరమైతేనే వైద్యుల సలహాపైన ఆ సప్లిమెంట్లు వాడాలి. 
పెయిన్‌ కిల్లర్లు: చిన్న నొప్పికే పెయిన్‌ కిల్లర్‌లు మింగేస్తూ ఉంటాం. ఇలా విచక్షణారహితంగా పెయున్‌ కిల్లర్స్‌ వాడటం వల్ల వాటి ప్రభావం కాలేయం మీద పడి సమస్యలు మొదలవుతాయి.
ట్రాన్స్‌ఫ్యాట్స్‌: ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అధిక మొత్తంలో శరీరంలోకి చేరటం వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ ప్యాకెట్ల మీద ‘పార్షియల్లీ హైడ్రోజినేటెడ్‌’ అని రాసి ఉంటే దాన్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉన్నాయని అర్థం. కొన్ని ప్యాకెట్ల మీద ‘జీరో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌’ అని పేర్కొన్నప్పటికీ కొద్దో గొప్పో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి వాటిని నమ్మకపోవటమే ఉత్తమం.
శీతల పానీయాలు: నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ బయటపడిన ఎక్కువ మందిలో కూల్‌ డ్రింక్స్‌ తీసుకునే అలవాటున్న వారే ఉన్నారని పరిశోధనల్లో తేలింది. వాటిలో ఉండే చక్కెర, ఇతర రసాయనాలు కాలేయానికి చేటు చేస్తాయి. జీరో క్యాలరీలు కలిగినట్టు, ప్రిజర్వేటివ్‌ లేనట్టు చెప్పే ఎలాంటి శీతల పానీయమైనా ప్రమాదకరమే! సోడాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. కాబట్టి వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
ధూమపానం: ధూమపానం ఊపిరితిత్తులకే చేటు అనుకుంటారు. కానీ పొగాకులోని విష పదార్థాలు రక్తం ద్వారా కాలేయాన్ని చేరి అస్వస్థతకు గురి చేస్తాయి. ఫలితంగా కాలేయ కణాలు దెబ్బతిని క్యాన్సర్‌కూ దారితీయొచ్చు. హెపటైటిస్‌ సోకిన సాధారణ వ్యక్తులతో పోలిస్తే ధూమపానం అలవాటున్న వ్యక్తులకు కాలేయ క్యాన్సర్‌ సోకే అవకాశం రెండింతలుంటుంది.
మద్యపానం: పరిమితికి లోబడిన మద్యపానం వల్ల ప్రమాదం ఉండదనేది అపోహే! ఈ అలవాటు వల్ల పరిమితిలోనే క్రమం తప్పకుండా నాలుగేళ్లపాటు మద్యం తీసుకునేవాళ్లు లివర్‌ సిరోసి్‌సకు గురవుతున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది.
ఊబకాయం: ఎత్తుకు తగిన శరీర బరువు ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా స్థూలకాయం తెచ్చుకుంటే ‘లివర్‌ ఫ్యాట్‌ సిరోసిస్‌’ రుగ్మత తలెత్తవచ్చు. ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రమం తప్పని వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
కాలేయ వ్యాధి సోకటం: ఇంజక్షన్లు, శరీర ద్రవాలు, రక్త మార్పిడి....ఈ మార్గాల ద్వారా కూడా ఆరోగ్యకరమైన వ్యక్తులకు కాలేయ వ్యాధులు సోకే అవకాశముంది. కాబట్టి డిస్పోజబుల్‌ ఇంజక్షన్లు వాడడం, రక్తమార్పిడి సమయంలో స్ర్కీనింగ్‌ చేయించటం, కాలేయ ఇన్‌ఫెక్షన్లు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం లాంటి జాగ్రత్తలు పాటించాలి. 

సొంత వైద్యం మానుకోవాలి! 

సాధారణంగా కాలేయానికి సంబంధించిన సమస్యలన్నిటిలో కామెర్ల లక్షణాలే కనిపి
స్తాయి కానీ సమస్య ఏదో తెలుసుకోకుండా నాటు వైద్యం, సొంత వైద్యాలపై ఆధారపడితే జరగకూడని నష్టం జరిగిపోవచ్చు. కాబట్టి హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ....వీటిలో ఏ రకం సోకిందో తెలియాలంటే కచ్చితంగా వైద్యుల్ని కలిసి పరీక్ష చేయించుకోవాల్సిందే! కాబట్టి కామెర్ల లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. కొందరు ఎంత చిన్న రుగ్మత వచ్చినా మందుల షాపులో మందులు కొని వాడేస్తూ ఉంటారు. ఇలా విచక్షణా రహితంగా వాడే ప్రతి మందులోని రసాయనాలూ కాలేయం మీద ప్రభావాన్ని చూపుతాయి. ఈ రసాయనాలు ఎక్కువ కాలం పాటు కాలేయ కణాల్లో నిల్వ ఉండటం మూలంగా కాలేయం దెబ్బతిని ఫెయిల్యూర్‌కి కూడా దారి తీయొచ్చు. కాబట్టి ఓవర్‌ ది కౌంటర్‌ మెడిసిన్‌ వాడకం మానేయాలి. 
 
డా. హరికుమార్‌ ఆర్‌. నాయర్‌, 

సీనియర్‌ హెపటాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌,

యశోదా హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.