నేడు వరల్డ్‌ కిడ్నీ డే

పనితీరు మందగించి కిడ్నీల వైఫల్యం 
బాధితుల్లో 20 నుంచి 30 మంది స్థూలకాయులే 
సైలెంట్‌గా కిడ్నీ అటాక్‌ 
539 మందికి కిడ్నీ మార్పిడి 
ముప్పు వచ్చే వరకు గుర్తించలేని జబ్బు 
జీవన్‌ధాన్‌లో 1713 మంది రిజిసే్ట్రషన్‌ 

అధిక బరువు మూత్రపిండాల పనితీరుకు అడ్డుపడుతోంది. కిడ్నీల వైఫల్యానికి కారణమ వుతోంది. వంద మంది బాధితుల్లో దాదాపు 30 మంది బరువు ఎక్కువ ఉండడం కారణంగానే సమస్యను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ:అధిక బరువుతో కిడ్నీ సమస్యలు పెరుగుతుండడంతో ఈ సారి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ‘అధిక బరువు - కిడ్నీ వ్యాధులు’ అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. స్థూలకా యంతో మధుమేహం, హైబీపీ వస్తాయని, వీటి ప్రభావం కిడ్నీలపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 30 శాతం అధిక బరువు, 40 శాతం మధుమేహం, మరో 30 శాతం హైబీపీ బాధితుల్లో కిడ్నీ ఫెయిల్‌ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.
 
సైలెంట్‌గా అటాక్‌ 
కిడ్నీ జబ్బు సైలెంట్‌గా అటాక్‌ చేస్తుంది. ఈ జబ్బు ఎప్పుడు ప్రాణాలను హరిస్తుందో తెలియదు. ఇది యువతరాన్ని కూడా వదలడం లేదు. బాధితుల సంఖ్యకు అనుగుణంగా దాతలు లేకపోవడంతో చాలా మంది మరణిస్తున్నారు. 70 నుంచి 80 శాతం మంది వరకు కిడ్నీ సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యుల లెక్కలు చెబుతున్నాయి. అధిక బరువు, హైపర్‌టెన్షన్‌, మధుమేహం ఉన్న వారిని వైద్యులు హై రిస్క్‌ రోగులుగా పరిగణిస్తున్నారు. అలాంటి వారు ఎప్పటికప్పుడు కిడ్నీ పనితీరును తెలుసుకోవాలి. రక్త ప్రసరణ, కిడ్నీ ఫంక్షన్‌ స్థాయి తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాలి. అదే విధంగా జన్యుపరమైన చరిత్ర ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీల కోసం జీవన్‌దాన్‌లో ఇప్పటి వరకు 1713 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 539 మందికి మాత్రమే కిడ్నీల మార్పిడి చేశారు.
 
యువతపైనా ప్రభావం... 
30 ఏళ్ల వయస్సు వారిలోనూ కిడ్నీ సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. మద్యం అలవాటున్న వారిలో 25 ఏళ్లకే కిడ్నీ జబ్బు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. యువకుల్లో కూడా అధిక బరువు, మధుమేహం, హైపర్‌టెన్షన్‌ పెరగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వివరించారు. పుట్టినప్పుడు ఏర్పడిన ఇబ్బందుల వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వెల్లడిస్తున్నారు.
 
 
జబ్బును గుర్తించలేక...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో 20 శాతం వరకు కిడ్నీ బాధితులు ఉన్నట్లు అంచనా. 30 శాతం మంది తమకు జబ్బు ఉన్నట్లు తెలుసుకోలేక పోతున్నారు. 75 శాతం మందిలో 3వ దశలో వ్యాధి బయటపడుతోంది. జబ్బు ఉన్నట్లు తెలియకపోవడంతో చాలా మంది చికిత్స తీసుకోవడం లేదు. ఎక్కువ శాతం జబ్బు ముదిరిన తర్వాత రావడం వల్ల చికిత్స పొందడంలో ఆలస్యమవుతోంది. ప్రస్తుతం ప్రతి డయాలసిస్‌ సెంటర్‌లో 150 మంది వరకు చికిత్స చేయించుకుంటున్నారని, అందులో 30 మందికి కిడ్నీ మార్పిడి అవసరమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నెలలో నాలుగు వరకు కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు.
 
రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వ్యయం 
కిడ్నీ జబ్బు వచ్చిందంటే కచ్చితంగా డయాలసిస్‌ చేయాల్సిందే. మధుమేహ బాధితులు డయాలసిస్‌ చేయించుకుంటే నెలకు దాదాపు రెండు వేల రూపాయల ఖర్చవుతుంది. ఏడాదికి మందులు, డయాలసిస్‌ కలిపి 30 వేల రూపాయల ఖర్చవుతుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు 5 నుంచి పది లక్షల రూపాయల ఖర్చవుతుంది. వైద్య ఖర్చు బాగా ఉండడంతో చాలా మంది డయాలసిస్‌, కిడ్నీ మార్పిడి చేయించుకోలేకపోతున్నారు. ఒకటి, రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకుని మానేస్తున్నారు. ఇటువంటి వారి ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు తెలిపారు. వ్యయం ఎక్కువగా ఉండడంతో ఆర్థిక స్థోమత లేని వారు చికిత్స చేయించుకోలేక పోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. 15 శాతం మందికే పరీక్షలు 
కిడ్నీ వ్యాధి బాధితులకు ముందుగా ఎటువంటి లక్షణాలూ కనిపించవు. కేవలం స్ర్కీనింగ్‌ ద్వారా మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది. చాలా మంది స్ర్కీనింగ్‌ చేయించుకోలేకపోతున్నారు. కేవలం సాధారణ మూత్ర, రక్త పరీక్షల ఆధారంగా 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ప్రాథమిక దశలో కిడ్నీసమస్యను గుర్తించ గలుగుతున్నారు. ప్రాథమిక దశలోనే జబ్బును గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ జబ్బును నియంత్రించే అవకాశముంది. తక్కువ బరువు, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో నెఫ్రోన్‌ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇటువంటి వారిలో క్రమంగా కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశముంది. గర్భస్థ శిశువుగా ఉన్నసమయంలో పోషకాహార లోపానికి గురైతే కిడ్నీ జబ్బు వచ్చే ప్రమాదముంది. 
- డాక్టర్‌ శ్రీ భూషణ్‌రాజ్‌, 
నిమ్స్‌ మూత్రపిండాల విభాగం అధిపతి 


మూత్రపిండాలపై భారం 
అధిక బరువున్న వ్యక్తుల్లో మూత్రపిండాలపై భారం పడుతోంది. మూత్రపిండాలు అదనపు బరువును భరించలేక వైఫల్యం చెందుతాయి. బరువు కారణంగా నేరుగా 10 నుంచి 20 శాతం మంది కిడ్నీలు దెబ్బతింటుంటే, పరోక్షంగా 20 నుంచి 30 శాతం మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక నెఫ్రాలజిస్టు వద్ద కొత్త, పాత కేసులు కలిపి నిత్యం 20 మంది కిడ్నీ రోగులు చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలూ చెడిపోతే మార్పిడి చేయించుకోక తప్పదు. కిడ్నీ మార్పిడి లేకపోతే డయాలసిస్‌ చేయించుకోవాలి. బీపీ, మధుమేహ రోగులకు ఒక కిడ్నీ కానీ, రెండు కిడ్నీలు కూడా చెడిపోయే ప్రమాదముంది. అదే విధంగా యూరిన్‌, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
డాక్టర్‌ రాజీవ్‌, నెఫ్రాలజిస్టు, 
సన్‌షైన్‌ ఆస్పత్రి