కాలేయాన్ని కాపాడుకుందాం

ఆంధ్రజ్యోతి (20-02-2017): ‘హెపటైటిస్‌ సి’ చికిత్సకు లొంగే వ్యాధే. కానీ, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధి వేధిస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజా, ఇటిక్యాల, గుంటూరు జిల్లాలోని మాచర్ల, దాని సమీప గ్రామాలు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని పాలకొల్లు, అమలాపురం తదితర ప్రాంతాల్లో.. చికిత్స తీసుకోకపోవడం వల్ల ‘హెపటైటిస్‌ సి’ కేసులు పెరుగుతున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది! పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ వ్యాధి మిగతా ప్రాంతాలకూ విస్తరించటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కాబట్టి హెపటైటిస్‌ బి, సిలను సమూలంగా నిర్మూలించడం కోసం సమర్థవంతమైన చికిత్స తీసుకోవాలంటున్నారు కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌

హెపటాలజిస్ట్‌ డాక్టర్‌. కె.ఎస్ .సోమశేఖర్‌ రావు. 

కళ్లు పచ్చగా కనిపిస్తే కాలేయానికి జబ్బు చేసి కామెర్లు వచ్చాయనుకుంటాం. ఉప్పు, కారాలు, నూనెలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని చాలామంది నమ్మకం. కానీ కామెర్లు మనం అనుకునేంత చిన్న సమస్య కాదు. కళ్లు పచ్చబడటం లాంటి లక్షణాలు హెపటైటి్‌సలో కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. వైరస్‌ వల్ల కాలేయం జబ్బు పడొచ్చు లేదా కాలేయంలోనే సమస్య ఉండి దాని వల్ల కామెర్లు రావొచ్చు. కాబట్టి కామెర్లు కనిపించినా కనిపించకపోయినా రక్త పరీక్షతో వ్యాధి సోకలేదని నిర్ధారించుకోవటం ఎంతో అవసరం. 
 
జాండిస్‌ అంటే?

జాండిస్.. హెపటైటి్‌స.. ఈ రెండూ వేర్వేరు సమస్యలు. అయితే లక్షణాలపరంగా రెండు వ్యాధులూ ఒకేలా ఉంటాయి. రెండు సమస్యలు కాలేయం జబ్బుపడటం మూలంగానే తలెత్తుతాయి. కాలేయం జబ్బు పడిందనటానికి సూచనగా కనిపించే మొదటి లక్షణం కళ్లు పచ్చగా తయారవడం. కళ్లతోపాటు, మూత్రం, చర్మం కూడా పచ్చగా మారిపోతాయి. ఇందుకు కారణం జబ్బుపడ్డ కాలేయం రక్తంలోని బైల్‌రుబిన్‌ను వడకట్టలేకపోవటమే! ఫలితంగా రక్తనాళాల ద్వారా బైల్స్‌ శరీరంలోని అన్ని ప్రాంతాలకు ప్రసరిస్తాయి. దాంతో ఆయా అవయవాలు పచ్చగా కనిపిస్తాయి. అయితే ఇందుకు ఎన్నో కారణాలుంటాయి. లివర్‌లో సమస్య ఉన్నా, కాలేయంలోని బైల్‌ డక్ట్స్‌లో సమస్య ఉన్నా, దాన్లో రాయి అడ్డం పడినా, కేన్సర్‌ వచ్చినా జాండీస్‌ వచ్చే అవకాశం ఉంది. ఇక హెపటైటి్‌స ఎ, బి, సి రకాల్లో ఏ రకం వైరస్‌ సోకినా కామెర్లు కనిపిస్తాయి. కాబట్టి కామెర్లు కనిపించగానే వైద్యుల్ని కలిసి అసలు సమస్య కనిపెట్టే ప్రయత్నం చేయాలి. 

 

 

చాలా రకాలున్నాయి..

 

హెపటైటిస్‌ వైర్‌సలో ఎ, బి, సి, ఈ అనే రకాలున్నాయి. వీటిలో ఎ, ఈ వైర్‌సలు కలుషిత నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే బి, సి వైర్‌సలు శరీర ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఎ, ఈ వైర్‌సలు కాలేయాన్ని వ్యాధిగ్రస్థం చేసినా రెండు, మూడు వారాల్లో తగ్గిపోతుంది. ఈ వ్యాధి పట్ల శరీరంలో రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి రెండోసారి ఈ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ. చాలా అరుదైన సందర్భాల్లో ‘హెపటైటిస్‌ ఈ’ లివర్‌ ఫెయిల్యూర్‌కు దారి తీయొచ్చు. ముఖ్యంగా గర్భిణిలకు సోకితే ప్రమాదం మరింత ఎక్కువ. ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. ఇక హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు ప్రమాదకరమైనవి. ఇవి వేగంగా కాలేయాన్ని నాశనం చేస్తాయి. వైద్య చికిత్స ఆలస్యమయ్యేకొద్దీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించినా కనిపించకపోయినా రక్త పరీక్ష చేయుంచుకుని వ్యాధి లేదని నిర్ధారించుకుంటూ ఉండాలి. ఒకవేళ వ్యాధి ఉందని గుర్తిస్తే ఆలస్యం చేయకుండా వైద్య చికిత్స మొదలుపెట్టాలి. 
 
ఈ లక్షణాలు కనిపిస్తే...
కామెర్లు వచ్చిన వెంటనే లేదా కామెర్లు వచ్చి తగ్గిపోయి ఆ లక్షణాలు ఇంకా కనిపిస్తూ ఉన్నా, ఆకలి పూర్తిగా తగ్గిపోయినా, వాంతులు వచ్చే భావన ఉన్నా.. వెంటనే డాక్టర్‌ని కలవాలి. 
 
పరీక్షలు ఇవే!
హెచ్‌బిఎస్‌ ఏజి అనే పరీక్షతో ‘హెపటైటిస్‌ బి’ ని, యాంటీ హెచ్‌సివి అనే రక్త పరీక్షతో ‘హెపటైటిస్‌ సి’ని గుర్తించవచ్చు. వీటితోపాటు ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌’ చేయిస్తే కామెర్లు ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఈ పరీక్షలతో శరీరంలో వైరల్‌ లోడ్‌ని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులతో ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఒకసారి ‘హెపటైటిస్‌ బి’ సోకిన వాళ్లు ఆరు నెలలకోసారి లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ చేయించుకుంటూ అవసరాన్ని బట్టి మందులు వాడాలి. వీళ్లలో వైరస్‌ ఇన్‌యాక్టివ్‌గా ఉండి వీళ్ల ద్వారా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తుల చుట్టుపక్కల ఉండేవాళ్లు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ‘హెపటైటిస్‌ సి’ విషయంలో కూడా ఇవే జాగ్రత్తలు పాటించాలి. 
 
నిర్లక్ష్యం చేస్తే?
హెపటైటి్‌సను నిర్లక్ష్యం చేస్తే అంతిమంగా కాలేయం కుంచించుకుపోయి లివర్‌ సిర్రోసిస్‌, లివర్‌ కేన్సర్‌, లివర్‌ ఫెయిల్యూర్‌లకు దారి తీయొచ్చు. ఇలాంటప్పుడు కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం. 
 
నాటుమందు పనిచేస్తుందా? 
కామెర్లు కనిపించగానే కొందరు నాటువైద్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ‘హెపటైటిస్‌ ఎ, ఈ’ లు వాటంతటవే తగ్గే వ్యాధులు కాబట్టి మందు వేసినా, వేయకపోయినా తగ్గిపోతాయి. కానీ ఆకుపసరు వేయించటం వల్లే తగ్గిందని అందరూ అదే వైద్యాన్ని అనుసరిస్తే ప్రమాదమే! ఆకుపసరులో ఏముందో వేసే వాళ్లకే తెలియదు. కొన్ని సందర్భాల్లో నాటువైద్యం వల్ల వ్యాధి ఇతర శరీర భాగాలకు వ్యాపించి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక.. ‘హెపటైటిస్‌ బి’ లేదా ‘సి’ వైరస్‌ వల్ల కామెర్లు వచ్చి ఉంటే చికిత్స ఆలస్యమయ్యేకొద్దీ ప్రాణాలకే ముప్పు సంభవించవచ్చు. అలాకాక కాలేయంలో, బైల్‌ డక్ట్స్‌లో సమస్య వల్ల కామెర్లు వచ్చి ఉంటే సమస్య సరిదిద్దేవరకూ కామెర్లు తగ్గకపోవచ్చు. కాబట్టి కామెర్లు కనిపిస్తే దాని అసలు కారణాన్ని కనిపెట్టి సరైస చికిత్స అందించే వైద్యులను కలవాలిగానీ నాటువైద్యులను ఆశ్రయించకూడదు. 
 
ఆరు నెలలకోసారి 
హెపటైటిస్‌ ఉన్నా లేకపోయినా రక్త పరీక్షతో ఆ వ్యాధి సోకలేదని నిర్ధారించుకోవటం ఎంతో అవసరం. వ్యాధి వల్ల ఆ వ్యక్తికేకాక పక్కనున్న వాళ్లకూ ప్రమాదమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి.. రక్తపరీక్షతో హెపటైటిస్‌ లేదని నిర్ధారించుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రమాదం నుంచి బయట పడొచ్చు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. వైద్యం వాయిదా వేస్తూ వచ్చినా ఇబ్బందులు రావొచ్చు. 
 
‘హెపటైటిస్‌ సి’ సోకే మార్గాలు
‘హెపటైటిస్‌ సి’ శరీర ద్రవాల వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది.
ఆ మార్గాలు ఇవే!
 సిరంజిలు (డిస్పోజబుల్‌ కానివి) 
 పచ్చబొట్లు 
 రేజర్‌ బ్లేడ్లు 
 రక్త మార్పిడి 
 సర్జరీల్లో వాడే ఇన్‌సు్ట్రమెంట్స్‌ (శుభ్రం చేయనివి) 
 లైంగిక క్రీడ
 
‘హెపటైటిస్‌ బి’ వ్యాక్సిన్‌ 
‘హెపటైటిస్‌ బి’ కి వ్యాక్సినేషన్‌ ఉంది. పుట్టిన పసికందు మొదలు ఏ వయసు వారైనా, ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్‌ చేయించుకోవచ్చు. హై రిస్క్‌ ఉన్న వాళ్లు... అంటే రోగులతో దగ్గరగా మెలిగే వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు, హెపటైటిస్‌ రోగుల కుటుంబీకులు ఈ వ్యాక్సిన్‌ను వెంటనే చేయించుకోవాలి. అయుతే ‘హెపటైటిస్‌ సి’కి వ్యాక్సిన్‌ లేదు. కాబట్టి సత్వర చికిత్స తప్ప.. మరో ప్రత్యామ్నాయం లేదు. 
 
డాక్టర్‌. కె.ఎస్. సోమశేఖర్‌ రావు 
కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌ హెపటాలజిస్ట్‌ 
 
 
అపోలో హాస్పిటల్స్‌
జూబ్లీ హిల్స్‌  హైదరాబాద్‌