కిడ్నీ ఫెయిల్యూర్‌ ప్రాణాంతకమా?

08-08-2017: మా నాన్నగారి వయసు 64. కొద్ది రోజుల క్రితం మూత్ర విసర్జన సాఫీగా జరగని కారణంగా డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాం. వెంటనే కొన్ని పరీక్షలు చేయించి ‘ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌’ అని చెప్పారు. అప్పటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఈ సమస్య రావడమేమిటో మాకేమీ అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా తగ్గిపోతుందిలే అనడం తప్ప, డాక్టర్లు మరే వివరాలూ చెప్పడం లేదు. మేము చాలా ఆందోళనతో ఉన్నాం. మా నాన్నకు ప్రమాదం ఏమీ లేదు కదా!

 
- పి. కరుణాకర్‌, తెనాలి
 
శరీరంలోని అంతర్గత కారణాల వల్ల కాకుండా బాహ్య కారణాల వల్ల మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ అంటారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినప్పుడు, అగ్ని ప్రమాదాల్లో శరీరం బాగా కాలిపోయినప్పుడు, వెన్నెముక లేదా వెన్నుపాము భాగంలో బలమైన దెబ్బలు తగిలినప్పుడు, మరేదైనా ప్రమాద జరిగినప్పుడు మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయలేని స్థితి ఏర్పడుతుంది.
ప్రమాదాల్లో బాగా రక్తస్రావం జరిగినప్పుడు సహజంగానే కిడ్నీలకు సరిగా రక్తం చేరదు. దీనివల్ల రక్తప్రవాహపు ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది మూత్రవిసర్జన ప్రక్రియను కుంటుపరు స్తుంది.
గుండెపోటు, క్లోమగ్రంథి, దెబ్బ తిన్నప్పుడు కూడా కిడ్నీలకు సరిపడా రక్తం అందక ఈ ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ జరగవచ్చు.
మూత్ర పిండాల్లో రాళ్లు, కణుతులు ఏర్పడినప్పుడు కూడా అవి రక్తప్రసారానికి అడ్డుపడి, ఈ ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ సమస్య రావచ్చు.
ఈ స్థితిలో, విసర్జించే మూత్ర పరిమాణం బాగా తగ్గిపోవడం, లేదా మూత్రం పూర్తిగానే ఆగిపోవడం జరగవచ్చు. కొందరిలో మత్తుగా ఉండడం, కడుపులో తిప్పడం, వాంతులు కావడం, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు ఏమైనా కావచ్చు. మూత్రం అతి తక్కువ పరిమాణంలో అంటే రోజుకు 400 మి.లీటర్ల కన్నా తక్కువగా మూత్ర విసర్జన జరగడాన్ని ‘అలిగూరియా’ అంటారు. రక్తంలోని వ్యర్థపదార్థాలను కిడ్నీలు సరిగా వడబోయలేకపోయినప్పుడు ఈ స్థితి వస్తుంది. ఒక్కోసారి మూత్ర విసర్జన పూర్తిగానే ఆగిపోతుంది. ఈ పరిణామాన్ని ‘అనూరియా’ అంటారు. ఏ మాత్రం వడబోత జరగక వ్యర్థాలన్నీ రక్తంలోనే నిలిచిపోయినప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది. అయితే కొంత మందిలో అన్నీ బాగానే ఉంటాయి. అంటే మూత్ర విసర్జన కూడా సక్రమంగానే జరుగుతుంది. అయితే మూత్రంలో వ్యర్థపదార్థాలు మాత్రం ఉండవు. దీనికి కిడ్నీలోని వడబోత వ్యవస్థ బొత్తిగా పనిచేయకపోవడమే కారణం,. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే సరైన వైద్య చికిత్సలు అందితే సమస్యలు తొలగిపోయి కిడ్నీలు మళ్లీ చక్కగా పనిచేయగలుగుతాయి. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
- డాక్టర్‌ జి. నారాయణమూర్తి, కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్‌