ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి హానికరమే...

డాక్టర్ల అధ్యయనంలో తేలిన నిజం
01-08-2017: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అధికంగా నీటిని తాగాలని అందరూ అనుకుంటారు...కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కనీస నీటిని తాగాలని ప్రాచీన ఆయుర్వేదిక్ గ్రంథాలు, వేదాలు చెపుతున్నాయని ఢిల్లీకి చెందిన సర్ గంగారాం ఆసుపత్రి డాక్టర్ పరమేశ్వర్ అరోరా  వెల్లడించారు. అధికంగా నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని తమ అధ్యయనంలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పరమేశ్వర్ అరోరా ఈ విషయాన్ని చెప్పారు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు అధికంగా నీరు తాగడం వల్ల మూత్రపిండాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పేగుల ప్రక్షాళనకు ఉదయాన్నే ఖాళీకడుపుతో 250 మిల్లీలీటర్లు లేదా ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలని డాక్టరు సూచించారు. భోజనం చేసేటపుడు 100 లేదా 150 మిల్లీలీటర్ల నీటిని తాగితే మేలని చెప్పారు. భోజనం అనంతరం ప్రతీ గంటకు లేదా రెండు గంటలకు ఓ గ్లాసునీటిని తాగితే మంచిదన్నారు. దప్పిక వేసినపుడు 200మిల్లీలీటర్ల గోరువెచ్చని నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ పరమేశ్వర్ అరోరా వివరించారు.