కలుషిత గాలితో కిడ్నీలకూ ప్రమాదమే!

 

వెల్లడించిన తాజా అధ్యయనం
వాషింగ్టన్‌, సెప్టెంబరు 22: కలుషిత గాలిని పీల్చడం వల్ల హృద్రోగాలు, పక్షవాతం, ఆస్తమా, కేన్సర్‌ వంటి వ్యాధులు వస్తాయనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి మూత్రపిండాల వ్యాధిని కూడా చేర్చింది ఓ అధ్యయనం. మూత్రపిండాల పనితీరు మందగించడానికి, పూర్తిగా దెబ్బతినడానికి గాలి కాలుష్యం కారణమవుతోందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 2004 నుంచి ఎనిమిదన్నర సంవత్సరాలపాటు 25 లక్షల మందిని పరిశీలించి ఈ విషయం వెల్లడించారు. నాసా, అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ నుంచి పలు ప్రాంతాల గాలి కాలుష్యం స్థాయిల సమాచారాన్ని సేకరించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారి మూత్రపిండాల పనితీరును పరీక్షించారు. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు 44,793 మంది, పూర్తిగా కిడ్నీలు పాడైన వారు 2438 మంది ఉన్నట్టు తేలింది