కాలేయం కులాసాగా

27-07-2017: 

నేడు ‘వరల్డ్‌ హెపటైటిస్‌ డే’

ఆహారంలోని పోషకాలను స్వీకరించటం, రక్తాన్ని వడగట్టడం, వ్యాధికారక సూక్ష్మజీవులతో పోరాడటం లాంటి మొత్తం 500 రకాల విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. ఇంతటి సామర్ధ్యం ఉన్న కాలేయం హెపటైటిస్‌ వైరస్‌లు, అస్థవ్యస్థ జీవనశైలితో కుదేలవుతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య ప్రమాణాలు పాటించాలి..
 
హెపటైటిస్‌ వ్యాధికి కారణాలు
హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ వైరస్‌లు కాలేయ ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తాయి. ఈ వైరస్‌లే కాకుండా మితిమీరిన, దీర్ఘకాల మద్యపానం, కొన్ని రకాల మందులు, ఊబకాయం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కాలేయం వ్యాధికి గురైతే మొదట కనిపించే లక్షణం ‘కామెర్లు’. అయితే కామెర్లకు కారణం, వైరస్‌ రకాలను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. హెపటైటిస్‌ వైరస్‌లు కలుషిత ఆహారం, నీరు, వ్యాధి ఉన్న రక్తం ఎక్కించుకోవటం ద్వారా సోకుతాయి. అయితే ఈ వైర్‌సలు శరీరంలో చేరి వ్యాధిగా బయల్పడటానికి కొంత సమయం పడుతుంది. ఈ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ హెపటైటిస్‌ ఎ, ఇ లైతే రెండు నుంచి ఆరు నెలలు సమయం పడితే, హెపటైటిస్‌ బి, సి వైరస్‌లకు 8 నుంచి 26 వారాల సమయం పడుతుంది. వైరస్‌ లేదా మద్యపానం ఏ కారణం వల్ల కాలేయం రోగగ్రస్థమైనా తక్షణ చికిత్స తీసుకోవటం అత్యవసరం.
 
లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కొందరు కామెర్లు వస్తే పత్యం ఉండటం, నాటు మందులు వాడటం చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. కామెర్లకు మూల కారణం తెలుసుకోకుండా స్వీయ చికిత్స తీసుకోవటం వల్ల వైరస్‌ మూలంగా కాలేయ కణాలు త్వరితగతిన చనిపోతూ తిరిగి సరిదిద్దలేని స్థితికి కాలేయం చేరుకోవచ్చు. మొదట స్కారింగ్‌, తర్వాత సిర్రోసి్‌సకు దారితీసి అప్పటికీ చికిత్స అందకపోతే లివర్‌ ఫెయిల్యూర్‌ కూడా సంభవించవచ్చు. కాబట్టి కామెర్ల లక్షణాలు కనిపించగానే సొంత వైద్యం మానుకుని వైద్యుల్ని కలవాలి.
 
లక్షణాలు ఇవే!
చర్మం దురదలు, కళ్లు, మూత్రం పచ్చబడటం, ఆకలి లేకపోవటం, వాంతులు, ఒళ్లు నొప్పులు, నిస్సత్తువ.
 
 
నివారణ మన చేతుల్లోనే!
కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాలేయాన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. అవేంటంటే...
పరిశుభ్రమైన నీరు తాగాలి.
రివర్స్‌ ఆస్మోసిస్‌ లేదా యు.వి వాటర్‌ ఫిల్టర్లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.
వీధుల్లో దొరికే పళ్ల రసాలు, తినుబండారాలకు దూరంగా ఉండాలి.
సెలూన్లలో, బార్బర్‌ షాపుల్లో ఇతరులకు వాడినది కాకుండా కొత్త బ్లేడునే ఉపయోగించాలి.
బ్యూటీ పార్లర్లలో ఉపయోగించే పరికరాలు డిస్పో జబుల్‌ తరహావై ఉండాలి.
హెపటైటిస్‌ బి, సి వైరస్‌లు లైంగిక సంబంధాల వల్ల కూడా సోకుతాయి. కాబట్టి తగినంత ప్రొటెక్షన్‌ తీసుకోవాలి.
ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ తీసుకోవటం హెపటైటిస్‌ సోకటానికి మరో ప్రధాన కారణం.
హెపటైటిస్‌ వైరస్‌ల నుంచి రక్షణ పొందటం కోసం టీకాలను ఆశ్రయించాలి.
కాయగూరలు, పళ్లను ఎక్కువ నీళ్లతో శుభ్రంగా కడిగి వాడాలి.
 
  
డాక్టర్‌ బాలచంద్రన్‌ మీనన్‌,
కాలేయ నిపుణులు,
యశోద హాస్పిటల్స్‌,
సికింద్రాబాద్‌.