ఆరోగ్యమిచ్చే గట్టి పిండాలు!

09-10-2017: రక్తాన్ని వడపోసి శరీరంలోని మలినాలను, విషాలను విసర్జించటానికి తోడ్పడే మూత్రపిండాలు మన ఆరోగ్యానికి కీలకమైన గట్టి పిండాలు. అయితే అవి కూడా అప్పుడప్పుడు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్సనందించాలి. అప్పుడే కిడ్నీ డ్యామేజ్‌ జరగకుండా ఉంటుంది. అలాకాకుండా అశ్రద్ధతో నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు ఫెయిలై ఏకంగా మూత్రపిండాలనే కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

సమస్య ఎప్పుడంటే...!
నోటి ద్వారా తీసుకునే ఆహారమైనా, మందులైనా చివరికి రక్తంలో కలవాల్సిందే! ఇలా మలినాలతో, విసర్జకాలతో, మందులతో కూడిన రక్తాన్ని వడగట్టే కీలక పాత్రను మూత్రపిండాలు పోషిస్తాయి. జీవించినంతకాలం ఇలా నిరంతరాయంగా రక్తాన్ని వడగట్టే క్రమంలో మూత్రపిండాలు ఎన్నో ఒత్తిడులకు లోనవుతూ ఉంటాయి. తగినంత నీరు తీసుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా, మధుమేహం, రక్తపోటు లాంటి ఆరోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్లనూ నిర్లక్ష్యం చేసినా మూత్రపిండాల మీద భారం రెట్టింపయి వాటి సామర్ధ్యం దెబ్బతింటుంది. ఫలితంగా అవి వ్యాధిగ్రస్థమతాయి. మూత్రపిండాలకు సంబంధించి సాధారణంగా కనిపించే వ్యాధులన్నీ ముందు జాగ్రత్త చర్యలతో నియంత్రించదగినవే!
 
కిడ్నీ ఫెయిల్యూర్‌
కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఎక్యూట్‌, క్రానిక్‌ అనే రెండు రకాలుంటాయి. డీహైడ్రేషన్‌ కారణంగా తలెత్తే ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాంతులు, విరేచనాలు, ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రపిండాలు పనిచేయలేని దశకు చేరుకోవచ్చు. మూత్ర విసర్జన జరగకపోవటం ఈ రుగ్మత ప్రధాన లక్షణం. ఈ రుగ్మతలో జ్వరం కూడా కనిపిస్తుంది. మధుమేహం, రక్తపోటు, పెయిన్‌ కిల్లర్స్‌ వల్ల మూత్రపిండాలు ఫెయిలైతే ఆ పరిస్థితిని క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌గా పరిగణించాలి. కాళ్లు, ముఖం వాపులు, మూత్ర విసర్జన తగ్గటం, ఆయాసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
 
కిడ్నీలో రాళ్లు
కొన్ని జన్యుపరమైన కారణాలు, డీహైడ్రేషన్‌ (దీని వల్ల యూరిన్‌లో నీటి పరిమాణం తగ్గి ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్ఫేట్‌ల గాఢత పెరిగి అవి రాళ్లుగా మారతాయి), డైటరీ ఫ్యాక్టర్లు (టమాటా, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, పాలకూరలకు కిడ్నీలో రాళ్లు తయారయ్యేందుకు దోహదపడే లక్షణాలుంటాయి)వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలుంటాయి. కిడ్నీలో ఏ రకమైన రాళ్లు ఏర్పడినా లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. వీపులో మొదలై గజ్జల్లోకి ప్రసరించే విపరీతమైన నొప్పి కిడ్నీ స్టోన్స్‌ ప్రధాన లక్షణం. అలాగే మూత్రంలో మంట, రక్తం, వాంతులు, జ్వరం, ఒకవేళ రెండు కిడ్నీల్లోనూ రాళ్లుంటే మూత్రం ఆగిపోవటం లాంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. కిడ్నీలో రాళ్లు చిన్నవిగా ఉంటే అవి పడిపోవటానికి మందులు తీసుకుంటూ ఎక్కువగా నీరు తాగమని వైద్యులు సూచిస్తారు. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి తోడ్పడే పదార్థాలు, నాన్‌వెజిటేరియన్‌ ఆహారం తగ్గించమని సూచిస్తారు.
 
మూత్రపిండాల ఆరోగ్యం కోసం...
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.
రక్తపోటు, మధుమేహాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే వాటిని అదుపులో ఉంచుకోవాలి.
రోజుకి 5 నుంచి 6 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు.
శరీరంలో నీటి శాతాన్ని సమతులంగా ఉంచాలి. అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి. డీహై డ్రేషన్‌కి గురవకుండా చూసుకోవాలి. జీవనశైలి, వాతావరణం, శరీర తత్వం, ఆహారపుటలవాట్ల ఆధారంగా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.
ధూమపానం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. అలాగే ధూమపానం వల్ల మూత్రపిండాలు క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి.
అవసరానికి మించి పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ప్రమాదకరం. ఈ మందులు మూత్రపిండాల్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో కలిసిన ఈ మందుల్ని ఫిల్టర్‌ చేసే క్రమంలో మూత్రపిండాలు ఎక్కువ శ్రమకు గురవుతాయి.

 

ఒకటే కిడ్నీ ఉంటే?

సాధారణంగా వ్యాధుల కారణంగా తొలగించటం వల్ల లేదా పుట్టుకతో కొందరు ఒకే మూత్రపిండంతో జీవితాంతం ఒకే కిడ్నీతో మనుగడ సాగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అది త్వరగా ఫెయిలవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అది అపోహ మాత్రమే! ఒకటే కిడ్నీతో పుట్టినవాళ్లు నిండు ఆరోగ్యంతో నూరేళ్లు బతకొచ్చు. రెండు ఆరోగ్యవంతమైన కిడ్నీలు ఉండి కూడా 60 ఏళ్లకే పోవచ్చు. కాకపోతే రెండు కిడ్నీలు ఉన్న వాళ్లకున్న అనుకూలత ఏంటంటే వ్యాధుల వల్ల ఒక కిడ్నీ కోల్పోయినా మరో కిడ్నీ ఉంటుంది కాబట్టి జీవితాన్ని వెళ్లదీయవచ్చు. ఒకే కిడ్నీ ఉన్న వాళ్ల విషయంలో అలా వీలు కాదు కదా! వాళ్లు ఉన్న ఒక కిడ్నీనీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉన్నవాళ్లు, వ్యాధుల వల్ల కిడ్నీ పోగొట్టుకుని ఒకే కిడ్నీ మిగిలినవాళ్లు, ఇతరులకు ఒక కిడ్నీ దానం చేసినవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండటంతోపాటు క్రమంతప్పక చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి.
రక్తపోటు, మధుమేహాలను అదుపులో ఉంచుకుంటూ మూత్రపిండాలు, యూరిన్‌ ఎగ్జామినేషన్‌, సీరమ్‌ క్రియాటినిన్‌, రక్త పరీక్షలు చేయించుకుంటూ యూరిన్‌లో ప్రొటీన్‌ పోతోందేమో పరీక్షించుకుంటూ ఉండాలి.
ఒకటే మూత్రపిండం ఉంటుంది కాబట్టి దాని మీద భారం పడటం సహజం. కాబట్టి ఆ భారానికి మూత్రపిండం భరించగలుగుతోందో లేదో ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్రమత్తంగా ఉంటే ఒకే మూత్రపిండంతో కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చు.