హోమియోపై అపోహలొద్దు

ఇదీ శాస్ర్తీయ వైద్య విధానమే

జన్యుస్థాయిలో పని చేయడం దీని ప్రత్యేకత

కేన్సర్‌కు సైతం సమర్థమైన చికిత్స

ప్రముఖ శాస్త్రవేత్త ఖుదా భఖ్ష్‌

27-08-2017:హోమియో చికిత్స విధానం అనగానే గుర్తొచ్చేది... చిన్న చిన్న గుళికల రూపంలో ఉండే మందులు.. పెద్ద పెద్ద రోగాలను ఇవి ఎలా తగ్గిస్తాయి.. అని చాలా మంది కొట్టిపారేస్తుంటారు.. ఇవేం పని చేస్తాయి అని అనుమానం, అపోహ. కానీ ఈ చిన్న గుళికలతో ఎంతటి రోగాన్నైనా నివారించవచ్చని చెబుతున్నారు ప్రొఫెసర్‌ ఖుదా భక్ష్‌. హోమియో మందులు జన్యుస్థాయిలో పని చేస్తాయని చెబుతారాయన. హోమియో చికిత్సా విధానం శాస్ర్తీయతను నిరూపించటానికి ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. జాతీయ హోమియో సదస్సులో పాల్గొనేందుకు ఖుదాబక్ష్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా హోమియో వైద్య విధానం సమర్థత.. ప్రజల్లో ఉన్న అపోహలపై ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

హోమియో.. శాస్త్రీయ వైద్య విధానం కాదనే విమర్శ వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?
ఇది పూర్తిగా అవాస్తవం. హోమియో శాస్త్రీయతపై అనేక పరిశోధనలు జరిగాయి... ఇంకా జరుగుతున్నాయి. తియ్యటి ఒక చిన్న గుళిక పెద్ద పెద్ద రోగాలను ఎలా తగ్గిస్తుందనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. హోమియో వైద్య విధానం కణం, జన్యు స్థాయిలో పని చేస్తుంది. దీనిని నిరూపించటానికి మేము అనేక పరిశోధనలు చేశాం. ఈ పరిశోధన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్‌ ప్రచురించాయి. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. మేము ఎలుకలపై చేసిన పరిశోధనల్లో- కేన్సర్‌ కణాలపై కొన్ని హోమియో మందులు జన్యు స్థాయిలో పనిచేస్తాయని తేలింది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే అనేక జబ్బులకు హోమియో మందులు పనిచేస్తాయి.
 
ఇంత సమర్థంగా పనిచేసే వైద్య విధానంపై అపోహాలు ఎందుకు తొలగిపోవడం లేదు..?
అవగాహన లేమి ఒక కారణం. ఫార్మా కంపెనీలు చేసే ప్రచారం ఇంకో కారణం. సరైన జ్ఞానం లేని వారు హోమియో డాక్టర్లుగా చెలామణి కావడం మరో కారణం. అల్లోపతికి వచ్చినంత ప్రచారం హోమియోపతికి రాకవపోవడం వల్లే ప్రజల్లో పలు అనుమానాలున్నాయి. కేన్సర్‌ను ఉదాహరణగా తీసుకుందాం.. కేన్సర్‌ వచ్చిన వ్యక్తి అల్లోపతి చేయించుకుంటే ఎంతకాలం బతుకుతాడో హోమియోపతి చేయించుకున్నా అంతే కాలం బతుకుతాడు. అలోపతిలో కన్నా హోమియోపతిలో కొన్నిరకాల కేన్సర్‌కు సమర్థవంత చికిత్స ఉంది. హోమియోలో జరుగుతున్న పరిశోధనలు, కొత్తగా వస్తున్న మందుల గురించి ఎవరూ మాట్లాడరు. ఏ వైద్య విధానం బతకాలన్నా దానిని ప్రాక్టీసు చేసే వైద్యులు సమర్థులై ఉండాలి. దురదృష్టవశాత్తు శాస్త్రీయ పద్ధతిలో ప్రాక్టీసు చేస్తున్న హోమియో వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది.
 
హోమియో విధానంలో అన్ని రకాల జబ్బులు తగ్గించేస్తామని టీవీ చానళ్లలో ప్రకటనలు చూస్తుంటాం. అది నిజమేనంటారా?
హోమియోలో చాలా రకాల వ్యాధులకు మందులు ఉన్నాయి. మీకు నా జీవితంలో ఎదురైన ఒక సంఘటన చెబుతా. 1976లో నేను కొంత మంది స్టూడెంట్స్‌ను తీసుకొని సిమ్లా వెళ్లా. అక్కడ ఒక అమ్మాయి కిందపడడంతో పన్ను విరిగిపోయింది. ఆ అమ్మాయి విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. రాత్రి కావడంతో డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరు. అప్పుడు మాతో ఉన్న ఒకరు- ఆర్నికా అనే హోమియో మందును ప్రతి పదినిమిషాలకు ఒక సారి వేశారు. ఇలా వేసిన తర్వాత గంటలోనే ఆ అమ్మాయికి నొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత మేము చేసిన అధ్యయనాల్లో ఈ మందులు జన్యు స్థాయిలో పని చేస్తాయని తేలింది.
 
హోమియో మందులు ఎలా పని చేస్తాయనే విషయం ఇప్పటి దాకా తెలియదు కదా?
హోమియో మందులు కణం, జన్యు స్థాయిలో పని చేస్తాయనే విషయం శాస్త్రీయంగా రుజువైంది. ఈ విషయం హోమియో సర్కిల్స్‌లో ఉన్న వారికి తెలుసు. హోమియోపై జరిగిన పరిశోధనల ఫలితాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో రాకపోవడంతో ఇతరులకు తెలిసే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అనేక అంతర్జాతీయ జర్నల్స్‌లో హోమియో పరిశోధన ఫలితాలు ప్రచురిస్తున్నారు.
హోమియో మందుల నాణ్యతపై కూడా అనేక విమర్శలున్నాయి... నిజమేనా?
ఇతర దేశాల్లో హోమియో మందులను అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తున్నారు. మందుల్లో వాడే ఔషధ మొక్కల ఎంపిక నుంచి మందుల తయారీ దాకా మొత్తం ప్రక్రియంతా అత్యున్నత ప్రమాణాలతో జరుగుతోంది. మన దగ్గర కొన్ని కంపెనీలు తప్పితే మిగితావి అలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ఇటీవల కాలంలో ఈ ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
 
హోమియో మందుల్లో వాడే మీడియం (ప్యూరిఫైడ్‌ ఆల్కహాల్‌) వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందని.. మోతాదు సరిగ్గా ఇవ్వకపోతే మందు పనిచేయదనే ప్రచారాలున్నాయి కదా..
 
ప్యూరిఫైడ్‌ ఆల్కహాల్‌ వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుందనేది పూర్తి అపోహ. హోమియో మందులను ఔషధమొక్కలతో తయారుచేస్తారు. అవి శరీరంలోకి వెళ్లి పనిచేయాలంటే ఒక మీడియం కావాలి. అందుకు ప్యూరిఫైడ్‌ ఆల్కహాల్‌ వాడతారు. అయితే, కచ్చితమైన మోతాదుతోనే రోగం నయమవుతుంది. మోతాదుల్లో తేడా వస్తే మందు పని తీరులో కూడా తేడా ఉంటుంది.