బ్లడ్‌ థిన్నర్స్‌ నిజానిజాలు!

26-02-2019: రక్తం ద్రవరూపాన్ని కలిగి ఉండడానికి కారణం వాటిలో ఉండే యాంటీ కాగులెంట్స్‌ అనే మూలకాలే! రక్తనాళాల్లోంచి రక్తం కారిపోకుండా కాగ్యులెంట్లు, ప్లేట్‌లెట్‌ కణాలు నిలువరిస్తూ ఉంటాయి. అయితే ఏ కారణంగానైనా వీటిలో అసమతుల్యత ఏర్పడినప్పుడు రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడడం, నాళాల్లోని రక్తం కారిపోవడం జరుగుతుంది.
 
రక్తనాళాల్లోని లోపలి పొర మామూలుగా ఎండోథీలియం అనే సున్నిత కణాలతో ఆవరించబడి ఉంటుంది. ఈ ఎండోథీలియం కణాలు క్రియాశీలకంగా ఉంటూ, రక్తప్రవాహాన్ని క్రమబద్దం చేస్తుంటాయి. దానికి తోడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా, రక్త నాళాల్లోంచి రక్తం కారిపోకుండా కూడా నిరోధిస్తుంటాయి. అయితే, వివిధ కారణాల వల్ల ఈ ఎండోథీలియం కణాలు దెబ్బతింటూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడిన కొందరిలో నాళాలు పగలడం, చిట్లడం వల్లగానీ, మధుమేహం, అధికరక్తపోటు, పొగతాగడం, కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం, అతి ఒత్తిడి వంటి కారణాల వల్ల ఎండోథీలియం కణాలు దెబ్బతింటాయి. ఇవే కాకుండా, శరీరకశ్రమ లోపం, స్థూలకాయం వల్ల కూడా ఈ స్థితి ఏర్పడుతుంది. ఎండోథీలియం కణాలు ఇలా దెబ్బ తిన్నప్పుడు రక్తం చిక్కబడటమో, గడ్డలు కట్టడమో జరుగుతుంది. ఈ గడ్డలు గుండె రక్తనాళాల్లో అడ్డుపడి గుండెపోటుకు కారణం కావచ్చు. మెదడు రక్తనాళాల్లో అడ్డుపడి పక్షవాతానికి కారణం కావచ్చు. అయితే, గడ్డలు ఏర్పడకుండా నిలువరించడానికి యాంటీ కాగులెంట్లను, ప్లేట్‌లెట్ల అసహజ ధోరణిని నిరోధించడానికి యాంటీ ప్లేట్‌లెట్లను ఇవ్వాల్సి ఉంటుంది.
 
బ్లడ్‌ థిన్నర్లు అందుకే...
సాధారణంగా రక్తాన్ని పలచబరిచే బ్లడ్‌ థిన్నర్లను రెండవ దశ వైద్యంగానే ఇస్తారు. అంటే యాంజియోప్లాిస్ట్టీ, లేదా స్టెంట్‌లు వేసిన తర్వాత ఇస్తూ ఉంటారు. ఈ మందులను కనీసం ఏడాదిపాటైనా, క్రమం తప్పకుండా రోజూ వేసుకోవలసి ఉంటుంది. దెబ్బతిన్న గుండె కవాటాలకు చికిత్స పొందిన వాళ్లయితే ఈ మందులను జీవితకాలమంతా వాడాల్సి ఉంటుంది. కాలి నరాల్లో రక్తం గడ్డలు కట్టినప్పుడు అవి కరిగిపోవడానికి ఈ మందులు 6 మాసాల పాటు వాడాల్సి ఉంటుంది. రక్తం పేరుకుపోవడం లేదా రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల కొందరి గుండె లయ తప్పి కొట్టుకుంటుంది. అలాంటి వారికి కూడా యాంటీ కాగ్యులెంట్లు, నావల్‌-యాంటీ కాగ్యులెంట్ల వంటి మందుల వల్ల ప్రయోజనం కలుగుతుంది.
 
జాగ్రత్తలు తప్పవు!
బ్లడ్‌ థిన్నర్ల వల్ల ఎంతో మంది హృద్రోగులకు ప్రయోజనం కలుగుతుందనేది వాస్తవం. అయితే, కొంత మంది హృద్రోగులు వీటి దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా రక్తం పలచగా ఉండడం వల్ల ఎముకలు, పొట్ట, చర్మం, మెదడు భాగాల్లో అతిగా రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. అయితే, రోగి పడిపోయి గాయాల పాలై, లేదా మరేదైనా ప్రమాదానికి గురైన వారిలోనే ఈ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా పలు విధాల ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఏదైనా సర్జరీ జరగడానికి, లేదా దంతాలను తొలగించడానికి ముందు బ్లడ్‌ థిన్నర్‌ మందులను ఆపాల్సి ఉంటుంది. సర్జరీ అయిపోయాక మందులను వేసుకోవడం మళ్లీ కొనసాగించవచ్చు. ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, బ్లడ్‌ థిన్నర్ల ద్వారా అనేక ప్రయోజనాలు, అవసరమైన ఆరోగ్య రక్షణ పొందవచ్చు.