గుండె ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ

07-06-2019:ఎరుపు రంగులో, హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీ పోషకాల నిధి. అందుకే వీటిని ఫ్రూట్‌ సలాడ్స్‌లో, ఐస్‌క్రీమ్‌ల తయారీలో విరివిగా వాడతారు. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలతో నిండిన ఈ పండును ఆరోగ్యసిరి అనొచ్చు. స్ట్రాబెర్రీ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలేమిటంటే...

స్ట్రాబెర్రీలలో సి, కె వంటి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి మినరల్స్‌ అధికంగా ఉంటాయి. విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి, గుండె పోటు ప్రమాదం నుంచి
కాపాడతాయి.
దీనిలోని పొటాషియం, మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తాయి. హృదయ కండరాలు గట్టిపడడాన్ని అడ్డుకుంటాయి.. దాంతో శరీర భాగాలకు రక్త సరఫరా సవ్యంగా జరుగుతుంది.
స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను రిలాక్స్‌ చేస్తాయి.
రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి.
స్ట్రాబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కీళ్లలోని సైనోవియల్‌ ద్రవం మోతాదు తగ్గిపోకుండా చేసి, ఆర్థరైటిస్‌ ముప్పు నుంచి రక్షిస్తాయి. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోకుండా చూస్తాయి.
స్ట్రాబెర్రీలోని మాలిక్‌ ఆమ్లం దంతాలను తెల్లగా, తళతళ మెరిసేలా చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీ మంచి ఛాయుస్‌. ఎందుకుంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్‌, అడిపోనెక్టిన్‌ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసి, బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
గర్భిణులు ఈ పండు తింటే వారికి అవసరమైన ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పడకుండా చూస్తుంది.
కళ్ల మీద స్ట్రాబెర్రీ ముక్కలను పదినిమిషాల పాటు ఉంచితే, కళ్ల కింది వలయాలు తగ్గిపోతాయి.