గురక... గుండెపోటుకు దారి

25-06-2018: నిన్నటిదాకా అందరితోనూ హుషారుగా కలసి తిరిగిన వ్యక్తి, రాత్రి గుండెపోటుతో పోయాడని తెలిస్తే ఎలా ఉంటుంది? అయినవాళ్లూ, ఆత్మీయులంతా గుండెలు బాదుకోవడమేగా! ఎప్పటినుంచో గుండె జబ్బుతో ఉన్న మనిషైతే ఆ చేదునిజాన్ని ఎలాగోలా జీర్ణించుకోవచ్చు కానీ, ఇప్పటిదాకా సంపూర్ణ ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి విషయంలో ఇలా జరగడం ఏమిటి? ఆశ్చర్యమేమిటంటే, గాఢ నిద్రలో ఉన్నప్పుడే ఇలాంటి విషాదాలు జరిగిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిశోధనల్లో ఇలాంటి అనేక హఠాన్మరణాలకు ఓ.ఎస్‌.ఏ (ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా)నే కారణంగా ఉంటోందని బయటపడుతోంది. ఓఎస్‌ఏ సమస్యలోని ప్రధమ లక్షణం గురక. ఎవరైనా గురకపెడుతున్నారంటే వారి గాలి నాళాలు పాక్షికంగా మూసుకుపోయాయని అర్థం.
 
అయితే ఈ గురక సమస్య ఉన్న కొంరదిలో ఈ గాలి నాళాలు ఒక్కోసారి పూర్తిగానే మూసుకుపోతాయి. . ఈ సమస్య ఉన్న వారి శరీరంలో నిద్రా సమయాన తరుచూ ఆక్సిజన్‌ నిలువలు తగ్గిపోతాయి. దీనివల్ల మాటిమాటికి నిద్రలోంచి దిగ్గున లే చి కూర్చుంటారు. మెలుకువతో పరిస్థితి కాస్త చక్కబడగానే మళ్లీ నిద్రలోకి జారిపోతారు. అయితే ఇదేమీ ఒకసారితో ఆగిపోయేది కాదుగా! మరికాసేపటికి మళ్లీ అదే సమస్య.. ఇలా పదే పదే నిద్రాభంగానికి గురయ్యే వీళ్లు పగలంతా కునికిపాట్లు పడుతూ ఉంటారు. సమస్య అంతటితో ఆగిపోతుందా అంటే ఒక్కోసారి అది గుండెపోటుకు, ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చునంటున్నారు, పరిశోధకులు. అందుకే ఎప్పుడూ ఉండే గురకే కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా సాధ్యమైనంత త్వరగా శ్వాసకోశ నిపుణులను లేదా స్లీప్‌ అప్నియా నిపుణులను సంప్రదించడం చాలా అవసరమని కూడా వారు చెబుతున్నారు.