గ్లాసు జ్యూస్‌తో గుండె పదిలం!

28-06-2018: గుండెను ఓ గ్లాసు జ్యూస్‌ ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు పరిశోధకులు. బీట్‌రూట్‌ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. కానీ బీట్‌రూట్‌ జ్యూస్‌ ప్రతిరోజూ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందనీ, తద్వారా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలావరకూ తగ్గిపోతాయంటున్నారు లండన్‌ పరిశోధకులు. ద్రాక్షరసం రక్తం సరఫరాను మెరుగుపరుస్తుందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ వెస్కోసిన్‌ పరిశోధకులు. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి ద్రాక్షరసం దోహదపడుతుందనీ ఇంకా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఓ గ్లాసు కమలాపండు రసం తాగాలని సూచిస్తున్నారు ఫ్రెంచి వైద్య నిపుణులు. కమలాపండులో ఉండే హెస్పిడిరిన్‌ అనే మిశ్రమం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని వారు చెబుతున్నారు. ఈ జ్యూస్‌ను నెలరోజులపాటు క్రమం తప్పకుండా తాగితే రక్తపోటును కచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు మాత్రం వైద్యుల సలహా ప్రకారం ఈ జ్యూస్‌ని తాగాలని వారు సూచిస్తున్నారు.