గుండె ఆరోగ్యానికీ ఉందో డైట్‌!

13-07-2018: ఆరోగ్యకరమైన ఆహారానికి, ఆరోగ్యకరమైన గుండెకు సంబంధం ఉంటుంది. మీ శరీరం బరువు పెరగడం, నడుము భాగం పెరిగిపోవడం కనిపిస్తే వెంటనే డైట్‌లో మార్పులు చేసుకోక తప్పదు. రోజూ తీసుకునే ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. బరువు తక్కువగా ఉంటేనే గుండె దిటువుగా ఉంటుంది. ‘‘గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల కూరగాయలు, పళ్లు తినాల్సిందే. వాటిని సహజరీతిలో తీసుకోవడమే మంచిది. వాటితో పాటు వాల్‌నట్స్‌, ఆల్మండ్స్‌, బెర్రీలు, అవిసె గింజలు, పాలకూర, బ్రకోలీ వంటివాటిని డైట్‌లో చేర్చాలి’’ అంటున్నారు ‘ఫార్మ్‌ ఈజీ’ వైద్య సంస్థ సహ వ్యవస్థాపకులు డాక్టర్‌ దావల్‌ షా.
 
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా డైట్‌ బాగుండాలి. చేపలు, ఆలివ్‌ ఆయిల్‌, కూరగాయలు, బీన్స్‌, నట్స్‌ మిశ్రమంతో మెనూ రూపొందించుకోవాలి. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్‌ ఉంటుంది. ఈ ఆహారం గుండెతో పాటు, మెదడు, కాలేయానికి కూడా మంచిది. గుండెకు ఆరోగ్యాన్నిచ్చే ఫుడ్‌లో చియా సీడ్స్‌, బ్లూ బెర్రీస్‌, టొమాటోలు, నిమ్మజాతి పళ్లు, అవొకడోలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించి, రక్తనాళాలను శుద్ధి చేస్తాయి. టొమాటోలోని పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ను పోగొడుతుంది. ఇక నిమ్మపళ్లలో ఉండే విటమిన్‌ సి గుండెజబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలోని సోడియం పరిమాణాలను బ్యాలెన్స్‌ చేసేందుకు అవొకడోలో ఉండే విటమిన్‌ ఇ, పొటాషియం సాయపడతాయి. ‘వీటన్నింటిని డైట్‌లో చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంద’ని అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్టు జాన్వి చితాలియా.