గుండెపోటు అప్పుడే ఎందుకు?

ఆంధ్రజ్యోతి, 08-07-2017:  మా తాతగారికి, పెద్ద నాన్నకు ఉదయం పూటే గుండెపోటు వచ్చింది. నాకు తెలిసిన వాళ్లలో చాలా మందికి ఉదయం పూటే గుండెపోటు రావడం గమనించాను. ఇలా ఉదయం పూటే రావడానికి ఏదైనా కారణముందా?
- డి. సుధీర్‌, రాజమండ్రి
 

గుండెపోటు ఎక్కువ మందికి తెల్లవారుజామునే రావడం యాదృచ్ఛికమేమీ కాదు. అలా రావడానికి శరీర ధర్మానికి సంబంధించిన స్పష్టమైన కారణాలే ఉన్నాయి. ఆ కారణాల్లో కొన్ని..

సహజంగానే తెల్లవారుజామున రక్తప్రసరణ అత్యంత సునిశితంగా ఉండి, బాహ్యాంతర ప్రభావాలకు సులువుగా లోనవుతూ ఉంటుంది. అందులో భాగంగా గుండెపోటు రావచ్చు.

తెల్లవారుజామున మనం నిద్రలేవడానికి కొన్ని గంటల ముందు శరీరంలో అడ్రినలిన్‌ వంటి హార్మోన్ల ఉత్పత్తి ఇతర వేళల్లో కన్నా అధికమవుతుంది. అయితే, రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం పగలు చేయాల్సిన పనులకు సన్నద్దమయ్యే క్రమంలో గుండె ఒత్తిడికి గురవుతుంది. ఇది కూడా ఆ హార్మోన్ల అధికోత్పత్తికి ఒక కారణం.

అడ్రినలిన్‌ హార్మోన్ల ఉత్పత్తి పెరిగినప్పుడు సహజంగానే రక్తనాళాలు ముడుచుకుంటాయి. దీనివల్ల ధమనుల లోపల పేరుకున్న కొలెస్ట్రాల్‌లో ఒక్కోసారి పగుళ్లు ఏర్పడతాయి. ఇది కూడా గుండెపోటు రావడానికి కారణమవుతుంది.

రక్తం గడ్డకడితే దాన్ని కరిగించే వ్యవస్థ ఒకటి శరీరంలో సహజంగానే ఉంటుంది. కాకపోతే, ఉదయం వేళల్లో ఈ వ్యవస్థ చాలా మందకొడిగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగకుండా అలాగే ఉండిపోతుంది. ఫలితంగా రక్తప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. దీనివల్ల గుండె కండరానికి అవసరమైనంత ఆక్సిజన్‌ అందక గుండెపోటు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తెల్లవారుజామున వచ్చే గుండెనొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు తరలించడం చాలా అవసరం.
- డాక్టర్‌ పి. ఉమేశ్‌, కార్డియాలజిస్టు