జీవనశైలి మార్పులతో గుండె పదిలం

20-06-2017:జీవన వృత్తికి సంబధించి అనునిత్యం మన పనులు మనం చేసుకుంటూ అలా వెళుతుంటాం. గుండె కూడా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ, ఒక్కోసారి అది తప్పటడుగులు వేస్తూ మన ప్రాణాల్ని ప్రమాదపు అంచుకు చేరుస్తుంది. మెదడుకు రక్తప్రసరణ జరగకపోతే పక్షవాతం వచ్చినట్టు, గుండెకు రక్తప్రసరణ అందకపోతే గుండెపోటే కదా వచ్చేది. అయితే గుండె ప్రధాన రక్తనాళాలు పూడిపోయి గుండెకు రక్తప్రసరణ జరగకపోతే అంతటితో అంతా అయిపోయినట్టేమీ కాదు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మరో అద్భుతమైన ప్రత్యామ్నాయ వ్యవస్థ మన శరీరంలో ఉంది.

అదే సూక్ష్మరక్తనాళాల వ్యవస్థ. తాత్కాలికంగా అవి ప్రాణాపాయ స్థితినుంచి తప్పించినా ఆ వెనువెంటనే జీవనశైలిలో మార్పులు చే సుకుని, రక్తనాళాల దారులు మళ్లీ తెరుచుకునే ప్రయత్నం చేయాలి.
 
గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డ వారికి లేదా ఒక సారి గుండెపోటు వచ్చిన వారికి ప్రతి అవయవం చుట్టూ ఉండే సూక్ష్మ రక్తనాళాలు (కొల్లాట్రల్స్‌) పనిచేయడం మొదలెడతాయి. అందుకే వారు గుండె పోటుకు గురికాకుండా ఉండిపోతారు. కాకపోతే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడే ఈ సూక్ష్మ రక్తనాళాలు పనిచేయడం మొదలెడతాయి. అత్యంత వేగంగా ఆటంకాలు ఏర్పడినప్పుడు ఈ సూక్ష్మ రక్తనాళాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవచ్చు. గుండెపోటు వచ్చి హఠాన్మరణం పాలైన వారి విషయంలో వీటి పాత్ర ఏమీ ఉండదు కానీ, సమస్య నిదానంగా మొదలయ్యే వారిని ఈ సూక్ష్మ రక్తనాళాలు కాపాడతాయి.
 
నిజానికి ఇప్పటిదాకా గుండెపోటుకు గురికాని వారి గుండె రక్తనాళాల్లో అసలు ఆటంకాలే లేవనికాదు. అయినా వారి గుండె సక్రమంగా పనిచేయడానికి వారి సూక్ష్మ రక్తనాళాలు పనిచేయడమే. అందువల్ల రిపోర్టులల్లో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయని తేలినంత మాత్రాన అందరూ వెంటనే శస్త్ర చికిత్సకు వెళ్లాలనేమీ లేదు. కాకపోతే వేగంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రకృతి వైద్య నియమాలన్నీ పాటించాలి. వీటివల్ల గుండెకు అవసరమైన రక్తం అందడమే కాకుండా, అప్పటికే గుండె రకతనాళాల్లో చేరిన అడ్డంకులు కూడా క్రమంగా తొలగిపోతాయి.
 
సహజ నియమాలు
మానసిక ఒత్తిళ్లు గుండె జబ్బులకు ప్రధాన కారణంగా చెబుతారు. అయితే, మానసిక ఒత్తిడికి గురయ్యే వారిలో శరీర శ్రమకు లేదా వ్యాయామానికి దూరంగా ఉండేవారే ఎక్కువ. రోజూ వ్యాయామం చేసేవారిలో గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా, వాళ్లు గుండెపోటుకు గురయ్యే అవకాశం చాలా తక్కువ. వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే, 90 శాతం వృక్ష సంబంధమైన ఆహార పదార్థాలు వృక్ష సంబంధమైనవి ఉంటే మేలు. పిండి పదార్థాలు, కొవ్వు మోతాదును ఆహారంలో బాగా తగ్గించడం చాలా అవసరం. అన్నింటినీ మించి రక్తం పలుచగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 
అప్పటికే గుండె జబ్బు ఉంటే..
ఆహారంలో పళ్ల రసాలు అంటే సిట్రస్‌ (విటమిన్‌-సి) ఉండేలా చూసుకోవాలి. పళ్లల్లో ప్రత్యేకించి, దానిమ్మ రసం లేదా ఉసిరికాయ రసం ఎంతో ఉత్తమం. వీటి ద్వారా రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ లేదా కొవ్వు కరిగిపోతుంది. ఒక వేళ వారికి మధుమేహమే ఉంటే ఇన్సులిన్‌ ఇస్తూనే అయినా దానిమ్మ రసం ఇస్తే, ఆ అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఇవన్నీ గుండె జబ్బు వచ్చే అత్యవసర పరిస్థితి కన్నా ముందే చేయాలి. ఒకప్పుడు గుండె జబ్బులన్నింటికీ, పెరిగిపోయిన కొలెస్ట్రాల్‌ నిలువలే కారణమని, గుండె రక్తనాళాల్లో అడ్డుపడేది ఈ కొలెస్ట్రాలే కారణమని చెప్పేవారు. ఇప్పుడు ఆ భావన మారిపోయింది.
 
రక్తకణాల్లో ఆటంకాలకు కొవ్వు కణాల్లో రక్తస్రావమైనప్పటి ఫ్రీ ర్యాడికల్స్‌ అక్కడ వాపు ఏర్పడటం కారణమని ఇటీవల వెల్లడయ్యింది. అయితే, ఆ ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే శక్తి దానిమ్మ రసానికి సమృద్ధిగా ఉంది. ఉసిరి కాయ రసంలో కూడా ఈ శక్తి ఉంది. రోజూ ఉదయమే పరగడుపున రెండు కాయల రసం తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ రసాల్లో ఏదో ఒకటి తీసుకుంటే కేవలం ఒకటి రెండు వారాల్లోనే గుండె నొప్పి తగ్గిపోతుంది. అదే క్రమంలో మెల్లమెల్లగా రక్తనాళాల్లోని ఆటంకాలు కరిగిపోతాయి.
 
అలాగే ఉదయం లేవగానే 5నుంచి 10 నిమిషాల వ్యవధిలో లీటర్‌నుంచి లీటర్‌ పావు నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల రక్తం పలుచబడి రక్తప్రసరణలోని అంత
రాయాలు తొలగిపోతాయి. అలాగే యోగాసనాలు, ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. వాస్తవానికి గుండె, శ్వాసకోశాలు ఈ రెండింటికీ మౌలికంగా ఒక యంత్రం ఉంటుంది. అందువల్ల శ్వాసకోశాలను శుద్ధి చేయడంతో పాటు, వాటిని చైతన్య పరిచే ప్రాణాయామం వల్ల గుండె పనితీరు కూడా చక్కబడుతుంది. గుండె జబ్బు నయమవుతుంది. ఉదయం అరగంట, సాయంత్రం ఒక అరగంట ఈ వ్యాయామాలు చేయడం ద్వారా గుండె జబ్బుల సమస్యనుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
- డాక్టర్‌ కె. సత్యలక్ష్మి, ప్రకృతి వైద్యం