డ్రైవర్‌ హృద్రోగ ముప్పును గుర్తించే కారు

వాషింగ్టన్‌, జూన్‌ 13: ఓ వైపు వాహనం నడుపుతూనే గుండెపోటుతో చనిపోయిన డ్రైవర్‌.. అంటూ తరచుగా పేపర్‌లలో చూస్తూనే ఉంటాం. ఆయా సందర్భాలలో డ్రైవర్‌తో పాటు ఇతరుల ప్రాణాలకూ ప్రమాదమే! గుండెపోటు కారణంగా డ్రైవర్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోతే, వాహనం అదుపుతప్పి ప్రమాదంజరగొచ్చు. యాక్సిడెంట్లలో ఇలాంటి సంఘటనల సంఖ్య చాలా ఎక్కువని మిచిగాన్‌ యూనివర్సిటీకి చెందిన కేవన్‌ నాజరియన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రైవర్‌కు గుండెపోటువచ్చే ముప్పును ముందే పసిగట్టే సరికొత్త సాంకేతికతను కార్లలో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో అటు డ్రైవర్‌ ప్రాణాలతోపాటు ప్రయాణికుల ప్రాణాలనూ రక్షించవచ్చని తెలిపారు. జపనీస్‌ ఆటోమోటివ్‌ దిగ్గజం టయోటాతో కలిసి సంయుక్తంగా ఈ కారును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.