దీనితో గుండె పదిలం

29-05-2018: గుండె వేగం పెంచే వ్యాయామాలతోపాటు గుండెకు విశ్రాంతినిచ్చే వ్యాయామాలు చేయడమూ అవసరమే! నిత్యం శరీరమంతా రక్తాన్ని పంప్‌ చేస్తూ అలసిపోయే గుండెకు నిద్రలో తప్ప విశ్రాంతి దొరకదు. ఆ భంగిమలో కూడా గుండె మీద అంతో కొంత ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అయితే రక్తప్రసార వేగాన్ని తగ్గించి గుండెకు సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతినిచ్చే భంగిమలూ ఉన్నాయి. వాటితో గుండెకు ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇదిగో ఈ వ్యాయామం కోసం రోజు మొత్తంలో కనీసం 5 నిమిషాలు కేటాయించండి. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే?

గోడకు దగ్గరగా మ్యాట్‌ వేసుకుని వెల్లకిలా పడుకోవాలి.
ఇలా పడుకున్నప్పుడు మోకాళ్లను మడిచి, పైకి లేపి, పిరుదులు గోడకు తగిలేలా దగ్గరగా జరగాలి.
చేతులను వెనక్కి వాల్చేసి, కాళ్లను నెమ్మదిగా నిటారుగా పైకి లేపాలి.
పైకి లేపిన కాళ్లను గోడకు ఆనించి, బరువును గోడ మీదే వేయాలి.
ఈ భంగిమలో ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుని, ఊపిరి పీల్చుకోవాలి.
ఆ సమయంలో గుండె వేగం తగ్గడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇలా 5 నిమిషాలపాటు ఉండి నెమ్మదిగా కాళ్లను కిందకి దించి, చేతులు నేల మీద ఉంచి, లేచి
నిలబడాలి.