హృద్రోగ బాధితులకు సాయంచేసే పరికరం

లండన్‌, మే 21: హృద్రోగ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే పరికరం త్వరలో అందుబాటులోకి రానుంది. బాధితులు స్వయంగా ఉపయోగించుకునేలా తయారు చేయడమే ఈ పరికరం ప్రత్యేకత! హార్ట్‌ ఫెయిల్యూర్‌ బాధితులను నిత్యం ఎవరో ఒకరు కనిపెట్టుకు ఉండాలి. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు టెన్షన్‌ పడుతుంటారు. ఈ ఇబ్బందిని తొలగించేందుకు లింకోపింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సరికొత్త టాబ్లెట్‌ పరికరాన్ని రూపొందించారు. దీనిని ఓపీటీఐఎల్‌ఓజీజీగా వ్యవహరిస్తున్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం.. రోగి ఆరోగ్య పరిస్థితిని, బరువును గమనిస్తూ తీసుకోవాల్సిన మందుల మోతాదును ఈ పరికరం సూచిస్తుంది. ఒకవేళ బరువు మరీ ఎక్కువగా పెరిగితే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.