హృద్రోగులకు ప్రత్యేక ఆహారం ఉందా?

29-08-2017:మా నాన్నగారి వయసు 68. రెండేళ్ల క్రితం ఆయనకు ఒక స్టెంట్‌ వేశారు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే హృద్రోగులు తీసుకునే ప్రత్యేకమైన ఆహారం ఏమైనా ఉందా? ఉంటే ఆ ఆహారం ఎలాంటిది? ఎలా తీసుకోవాలి? ఈ వివరాలు తెలుసుకోవాలని ఉంది. 

                                                                                                                                                                                                            - సి. నిరంజన్‌, మంచిర్యాల

గుండె జబ్బును నయం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలు ఉన్న మాట నిజమే. అలాంటి వాటిల్లో కొన్ని.....
 
ఓట్లు: నీటిలో కలిసిపోగ లిగే ఒక జిగురు పదార్థం, లిపిడ్స్‌ను తగ్గించే గుణం ఉన్న బి- గ్లూకాన్‌ వీటిలో ఉన్నాయి. రోజుకు 25 గ్రాముల ఓట్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
 
వెల్లుల్లి: చాలా పరిశోధనల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఎల్‌.డి.ఎల్‌ను, ట్రైగ్లిసరైడ్లను తగ్గించే సానుకూల అంశాలు వెల్లుల్లిలో ఉన్నాయని తేలింది. రక్తాన్ని గడ్డకట్టించే త్రాంబోసిస్‌ సమస్యను వెల్లుల్లి అడ్డుకుంటుంది. దీనికి తోడు అధిక రక్తపోటును తగ్గించే శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. రోజుకు రెండు వెల్లుల్లి పాయలను తీసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
 
మెంతులు: వీటిలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని మొత్తం 50 శాతం పీచుపదార్థంలో 20 శాతం జిగురుతో ఉండే పీచుపదార్థం ఉంటుంది. ఇది పైత్యరసంలోని ఆమ్లాల, తటస్థమైన స్టెరాయిడ్ల విసర్జనను పెంచుతుంది. దీనికి తోడు కాలేయంలో కొలెస్ట్రాల్‌ ఒత్తిడి ని తగ్గిస్తుంది. అందువల్ల రోజుకు 20 గ్రాముల మెంతులు తీసుకుంటే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి.
 
సోయాపాలు: సోయాలోని మాంస కృత్తులకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి ఉంది. దీనితో పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు. రోజుకు 300 మి. లీటర్ల సోయా పాలు తీసుకుంటే హృద్రోగులకు ఎంతో మేలు కలుగుతుంది.