మూలికా వైద్యంతో గుండె జబ్బుల నుంచి ముక్తి

ఆంధ్రజ్యోతి, 13-06-2017: లయ, సంగీతానికి మాత్రమే సంబంధించినదేమీ కాదు. అది జీవితంలో భాగం కూడా. సృష్టిలోని ప్రతిదీ లయబద్ధంగా సాగిపోతున్నట్లే, శరీరానికి మూలాధారమైన గుండె కూడా లయబద్ధంగానే సాగిపోతుంది. ప్రకృతి సహజమైన జీవనశైలిని అనుసరించే వారికి ఆ గుండె లయ త ప్పకుండా అలా సాగిపోతూనే ఉంటుంది. కాకపోతే ఆ స్థితి జీవితమంతా అలా సగిపోవడానికి శరీరానికి ఏమివ్వాలో, ఏమి ఇవ్వకూడదో తెలియాలి. ఏదిబడితే అది శరీరంలోకి తోసేస్తూ పోతే శరీరం తన సహజస్థితిని కోల్పోతుంది. జీవక్రియలన్నీ కుంటుపడిపోయి గుండె నుంచి మొదలుకుని ప్రతి అవయవమూ తన పనితనాన్ని కోల్పోతుంది. ఇంతకీ శరీరం కెల్లా అత్యంత కీలకమైన గుండె కొంతమందిలో పిన్న వయసులోనే రోగ గ్రస్థమై, సగం జీవితంలో సమాప్తమైపోతుంది. ఎందుకని ? నిండు నూరేళ్లు చకచకా సాగిపోవలసిన గుండె, జబ్బులతో, గుండెపోట్లతో ఎందుకలా అర్ధాంతరంగా ఆగిపోతుంది?

ఏమిటా కారణాలు?
అసలు గుండెపోటు ఎందుకొస్తుంది అనే ప్రశ్నకు గుండె ధమనులు కొన్ని రకాల వ్యర్థపదార్థాలతో, ఎల్‌.డి.ఎల్‌ కొలెస్ట్రాల్‌ వంటి హానికారక అంశాలతో కరడుగట్టిన గారతో పూడిపోవడం వల్ల అని చెబుతారు. గుండె ధమనులు అలా పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ పూడిపోవ డానికి, అధిక స్థాయి కొలెస్ట్రాల్‌తో పాటు, అధిక రక్తప్రసరణ ఒత్తిడి, ధూమపానం, మధుమేహం ప్రధాన కారణాలుగానూ, స్థూలకాయం, శరీర శ్రమలేని తనం, ఆవేశ, ఉద్రేక పూరిత తత్వం, పెద్ద వయసు, సంతాన నియంత్రణ ఔషధాల వాడకం, మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, అలజడులు ఇతర కారణాలుగానూ గుర్తించారు.

అసలు కారణాలు తెలియాలి....
మానవ దేహ సంపూర్ణ స్వస్థత దేహంలో సహజంగా ఉండే నాలుగు ద్రవాలు (హ్యూమర్స్‌) సరైన నిష్పత్తుల్లో ఉండడం మీదే ఆధారపడి ఉందని వాటిని అలా సహజ పరిమితుల్లో ఉంచుకుంటే సంపూర్ణ స్వస్థత కొనసాగుతుందని ఐదవ శతాబ్దంలోనే హిపోక్రేట్స్‌ చెప్పాడు. ఆయుర్వేద వైద్య ఆద్యుడైన చరకుడు, మానవ దేహ సంపూర్ణ స్వస్థత దేహంలో సహజంగానే ఉండే వాత, పిత్త , కఫాలు సరైన నిష్పత్తుల్లో ఉండడం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు.

హిపోక్రేట్స్‌, చరకుడి సూత్రీకరణల సారాంశం మౌలికంగా ఒక్కటే. ద్రవ్యాలు గానీ, వాతపిత్త కఫాలుగానీ శరీర పోషకాంశాలు, వ్యాయామం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటా యి. ప్రధాన సూక్ష్మ పోషక పదార్థాలు సరైన నిష్పత్తుల్లో ఉన్నప్పుడే సంపూర్ణ స్వస్థత ఉంటుంది. సంపూర్ణ స్వస్థత వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల్ని నిరోధించడం, నయం చేయడాన్ని సులభతరం చేస్తుంది. వీటితో పాటు మూలికా ఔషధాలు తీసుకుంటే వ్యాధులు సమూలంగా నయమవుతాయి. కానీ, ఆహారంలో పోషక విలువల్ని, వ్యాయామాల్ని, వ్యాధి నిరోధక శక్తిని నిర్లక్ష్యం చేసి యాంటీబయాటిక్‌ ఒరవడి తెచ్చిపెట్టారు వాస్తవానికి, శస్త్ర చికి త్సలు అవసరం లేకుండానే గుండె ధమనుల పూడికను క రిగించి తీసివేసి వాటి స్వస్థతను పునఃస్థాపించే ప్రత్యామ్నాయ చికిత్సలు గత 50 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి.

ఈ చికిత్సలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తునాయి. గుండెజబ్బులు, గుండె పోటు వచ్చేదాకా అలా ఉండిపోకుండా, ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటూ కొలెస్ట్రాల్‌ నిలువల్ని తెలుసుకోవాలి. ఒకవేళ ప్రమాదస్థాయికి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే మూలికా చికిత్సలు తీసుకోవడం ప్రారంభించాలి.

ఆహారం ఎలా ఉండాలి?

    ఆహారంలో సంతృప్త (సాచురేటెడ్‌) అసంతృప్త (అన్‌సాచురేటెడ్‌ ) కొవ్వు పదార్థాలు 30 శాతానికి మించి ఉండకూడదు.
    తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, తవుడు తీయని బియ్యం, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు తగిన నిష్పత్తిలో ఉండాలి.
    ఉప్పులో ఊరబెట్టిన పచ్చళ్లు, చేపలు వాడకపోతేనే మంచిది. లేదంటే చాలా పరిమితంగా తీసుకోవాలి.
    మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క లాంటి మసాలా దినుసులు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.
    ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామాలు చేయాలి.
    మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి ప్రతి రోజూ క్రీడల్లో పాల్గొనడం, సంగీతం వినడం ఇలాంటి మనోల్లాస విషయాలకు ప్రాధాన్యమివ్వాలి.

- డాక్టర్‌ జి లక్ష్మణ్‌ రావు