పనిగంటలతో గుండెకు చేటు?

11-08-2017: ఏ పనీ చేయకుండా బద్ధకంగా ఓ చోట కూచుంటే శరీరం బరువు పెరిగి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే! అలాగని ఎక్కువ గంటలు పనిచేసినా గుండె సంబంధిత సమస్యలు 40 శాతం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశోధకులు. ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. సుమారు 85వేల మంది పనిగంటల మీద సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. వారంలో 55 గంటల కన్నా ఎక్కువ సేపు పనిచేసిన వారిలో సుమారు వెయ్యిమందికి గుండె సంబంధిత సమస్యలను అధ్యయనకారులు గుర్తించారు. పనిగంటలు ఎక్కువ అయితే పని ఒత్తిడిపెరగడం, అలసట, నిద్రలేమి, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి కారణాలు తోడై గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయనీ, కొన్ని సార్లు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. వారంలో 48 నుంచి 50 గంటల పాటు పని గంటలు ఉండేలా చూసుకుంటూ కంటి నిండా నిద్రా, తగిన పోషాకాహారం తీసుకుంటే గుండెజబ్బుల బారి నుంచి చాలా వరకూ తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.