చిన్న వయసులో పిడుగు పోటు

‘గుండెపోటు’ అనగానే ఛాతీ పట్టుకుని కుంగిపోతున్న వృద్ధులు కళ్లముందు మెదులుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 25 నుంచి 30 ఏళ్ల వయసువాళ్లూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇందుకు కారణాలు మనలో, మన చుట్టూరానే ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోగలిగితే యువత గుండె సమస్యల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు వైద్యులు.

 
22-08-2017:గుండె పనితీరు మెరుగ్గా ఉండాలంటే జీవనశైలి, ఆహారపుటలవాట్లు సక్రమంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండూ క్రమం తప్పుతాయో వాటి ప్రభావం శరీరం మీద పడి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పుతుంది. కాలంతోపాటు మన ఆహార వ్యవహారాల్లో, జీవన విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. వేళకు తిండి, నిద్ర కరువయ్యాయి. శారీరక శ్రమ తగ్గి, మానసిక ఒత్తిడి పెరిగింది. మద్యం, ధూమపానం లాంటి వ్యసనాలు పెరిగాయి. వీటన్నిటి ఫలితంగా శరీరం ఒడుదొడుకులకు గురవుతూ, క్రమేపీ ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైపోతోంది. ఈ పరిస్థితి గుండె జబ్బులకు దారి తీస్తోంది.
 
ధూమపానం వద్దే వద్దు!
గుండె జబ్బులకు కారణమయ్యే అంశాల్లో ప్రధానమైనది ధూమపానం! దూమపానం వల్ల రక్తం చిక్కబడుతుంది. రక్త నాళాల వైశాల్యం తగ్గి ఇరుకుగా మారి రక్త ప్రవాహం సాఫీగా జరగదు. ఫలితంగా గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందక అవి సామర్ధ్యాన్ని కోల్పోతాయి. ధూమపానానికి మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్‌, వ్యాయామ లోపం, కుటుంబ చరిత్ర మొదలైనవి కూడా తోడైతే యుక్తవయసులోనే గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు రెట్టింపవుతాయి. ఇంట్లో ఒకరు ధూమపానం చేస్తే మిగతా కుటుంబసభ్యులూ దాని ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. వీళ్లనే ‘ప్యాసివ్‌ స్మోకర్స్‌’ అంటారు. వీళ్లు కూడా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలుంటాయి.
 
ఒత్తిడి చిత్తు
శారీరక, మానసిక, వృత్తిపరమైన ఒత్తిడి ఏదైనా గుండె మీద ప్రభావం చూపిస్తుంది. పట్టణ జీవితం, ఉద్యోగంలో కలిగే శారీరక, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలు.. వీటిలో దేని ప్రభావమైనా శరీరం మీద ఎక్కువే! వృత్తి వేళల్లో మార్పులు, ఆహార నియమాలు, సమయపాలన పాటించకపోవటం, రాత్రి పని చేయటం, ఉన్న చోటు వదిలేసి కొత్త ప్రదేశాలకు వలస వెళ్లటం... ఇలా ఒత్తిడికి కారణాలెన్నో! అలాగే వ్యక్తిగత అనుబంధాలు కూడా ఈమధ్య కాలంలో తారుమారు అవుతున్నాయి. ఉద్యోగ బాధ్యతల వల్ల జీవిత భాగస్వామికి తగినంత సమయాన్ని కేటాయించలేకపోవటం, దంపతుల మధ్య అనుబంధం బీటలుబారటం, విశ్రాంతి, రిలాక్సేషన్‌ లేకపోవటం... ఈ కారణాలన్నీ కూడా గుండెపోటుకు దారి తీస్తాయి. పూర్వంతో పోలిస్తే ఈమధ్య కాలంలో ఉమ్మడి కుటుంబాలనేవి కనుమరుగై పోయాయి. పెద్దల సహాయ సహకారాలతో పని లేకుండా స్వతంత్రంగా జీవించాలనే నైజం నేటి యువతలో పెరిగిపోయింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం, వేరుగా ఉండటం.. వీటివల్ల కూడా ఒత్తిడి పెరుగుతోంది.
 
ఆహార నియమాలు, సమయాలు
వేళపట్టున తినే అలవాటు యువతలో లోపిస్తోంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కొంత అల్పాహారం, రాత్రివేళ తేలికపాటి భోజనం... ఈ నియమాలు క్రమం తప్పాయి. ఆకలితో పనిలేకుండా చేతికందినది తినేయటం, ఆకలి వేసినప్పుడు పౌష్టిక ఆహారం తీసుకోకుండా కాఫీ, టీలు, కోలాలతో కడుపు నింపేయటం మొదలైన అలవాట్లు కూడా ప్రమాదమే! ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలనే విషయాల మీద అవగాహన లేదు. తినకూడనివి తింటూ తినవలసిన వాటిని దూరం పెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఇంటి భోజనానికి బదులుగా బయట దొరికే జంక్‌ ఫుడ్‌, వాటి తయారీలో వాడే కలరింగ్‌ ఏజెంట్స్‌, ప్రిజర్వేటివ్స్‌, కృత్రిమ చక్కెరలు, నూనెలు, కొవ్వులు ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ బ్రేక్‌ఫాస్ట్‌ చేయటం, బ్రేక్‌ఫాస్ట్‌ మానేసి ఒకేసారి లంచ్‌ చేసేయటం, రాత్రి వేళ బాగా పొద్దుపోయాక భారీ భోజనం చేయటం మొదలైన అలవాట్లన్నీ అనారోగ్యకరమే!
 
నిద్ర ఎంతో అవసరం
మన బయలాజికల్‌ క్లాక్‌కి అనుగుణంగా నడుచుకోవాలి. అంటే నిద్ర వేళలను కచ్చితంగా పాటించాలి. నిద్ర సమయంలో మేల్కొని, మేల్కొని ఉండాల్సిన సమయంలో నిద్రపోవటం వల్ల బయలాజికల్‌ క్లాక్‌ అస్థవ్యస్థమవుతుంది. కొంతమంది రాత్రి నిద్ర తక్కువైన నిద్రను పగలు భర్తీ చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి వ్యక్తీ రోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్ర పోవాలి. నిద్రలో శరీరం సేద తీరటంతోపాటు, తనను తాను మరమ్మత్తు చేసుకుని మరుసటి రోజుకి కావలసిన శక్తిని సమకూర్చుకుంటుంది. ఎప్పుడైతే ఈ పనిలో లోటు పడుతుందో ఆ ప్రభావం ఆరోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలంపాటు కొనసాగితే రక్తపోటుకు గురవక తప్పదు. ఈ రక్తపోటే క్రమేపీ గుండెను దెబ్బతీసి హృద్రోగాలను కలుగుజేస్తుంది.
 
వాతావరణ కాలుష్యమూ ప్రమాదమే!
గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందనే విషయం అందరికీ తెలిసిందే! మరీ ముఖ్యంగా పట్టణాల్లో నివసించేవాళ్లు ఎలాంటి రక్షణ చర్యలూ పాటించకుండా ట్రాఫిక్‌ రద్దీలో తిరుగుతూ ఉంటే ఆ ప్రభావం అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు పెరిగి ఫలితంగా గుండె కవాటాలు, కండరాలు దెబ్బతింటాయి. అలాగే శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యాలు కూడా ప్రమాదమే! వీటి నుంచి రక్షణ పొందే మార్గాలను అనుసరించాలి. ముక్కుకు మాస్క్‌ ధరించటం, శుభ్రమైన నీటిని తాగటం, విపరీతమైన శబ్దాలకు దూరంగా ఉండటం చేయాలి.
 
వ్యాయామం కొరవడితే?
గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ల ముందు పని చేయటం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! శారీరక వ్యాయామంతో ఈ అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అస్త్యవస్త జీవనశైలి వల్ల రక్తంలో పెరిగే కొలెస్ట్రాల్‌ను కూడా వ్యాయామంతో తగ్గించవచ్చు. కాబట్టి రోజు మొత్తంలో కనీసం అరగంటపాటైనా నడక లాంటి సాధారణ వ్యాయామం చేయాలి. వ్యాయామానికి ప్రత్యేక స్థానం కేటాయించాలి. యోగా, కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌, ఈత, క్రీడలు.. వీటిలో ఇష్టమైన దాన్ని అనుసరించాలి.
 
గుండె జబ్బులకు దూరంగా!
గుండె జబ్బులకు గురికాకుండా ఉండాలంటే అందుకు కారణమయ్యే అంశాలకు దూరంగా ఉండాలి.
మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలి.
ఆహార నియమాలు పాటించాలి.
నిద్ర వేళలను కచ్చితంగా అనుసరించాలి.
జంక్‌ ఫుడ్‌కు బదులు తాజా కూరగాయలు, ఆకుకూరలు పళ్లు తినాలి.
సమతులాహారం తీసుకోవాలి.
ప్రతి రోజూ కనీసం అరగంటపాటైనా నడక లాంటి తేలికపాటి వ్యాయామం చేయాలి.
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.
 
గుండె కవాటాలు, కండరాల సమస్యలు, పుట్టుకతో గుండెలో లోపాలు.. ఇలా యువతలో తలెత్తే గుండె సమస్యలకు మూలాలెన్నో ఉంటాయి. హృదయ కండరాలు బాగా లావుగా తయారై, భవిష్యత్తులో గుండెనొప్పులు, కార్డియాక్‌ డెత్‌, గుండె కొట్టుకునే వేగంలో అవకతవకలు లాంటి సమస్యలు కూడా రావొచ్చు. అలాగే అథెరోస్క్లిరోసిస్‌ వలన పెద్ద వయస్కుల్లో వచ్చే గుండె నొప్పి యుక్త వయస్కుల్లోనూ రావొచ్చు. పెద్ద వాళ్లలో గుండె నొప్పి, గుండెనొప్పితో కూడిన గుండె సమస్యలు కనిపిస్తే చిన్న వయస్కుల్లో రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌, కవాటాల సమస్యలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జన్యుపరంగా వచ్చే కార్డియోమయోపతి మొదలైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.
 
 
గుండె సమస్య గుర్తించేదిలా!

సమస్య తలెత్తినప్పుడు సకాలంలో గుర్తించి చికిత్స చేసే వీలుంది. అయితే అసలు సమస్యే తలెత్తకుండా చూసుకోగలిగితే చికిత్సతో పని లేకుండానే ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి గుండె సమస్యలకు కారణమయ్యే అంశాలను తెలుసుకుని వాటిని నియంత్రించాలి. ఒకవేళ గుండె సమస్య మొదలైనా దాన్ని ప్రారంభంలోనే గుర్తించగలిగితే గుండె కండరాలు మరింత దెబ్బతినకుండా చికిత్సతో నియంత్రించవచ్చు. కాబట్టి గుండె సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హృద్రోగ లక్షణాలు ఏవంటే....

తేలికగా అలసిపోవటం
బరువు పనులు చేసినా, మెట్లు ఎక్కుతున్నా, పరిగెత్తుతున్నా, వ్యాయామం చేస్తున్నా తేలికగా అలసట రావటం
గుండె వేగంగా కొట్టుకోవటం

పని చేస్తున్నప్పుడు వాంతి వచ్చినట్టు అనిపించటం, విపరీతంగా చమట పట్టడం.

ఆడవాళ్లు మినహాయింపు కాదు!
వరల్డ్‌ బ్యాంక్‌ ఇటీవల ఓ సర్వే చేపట్టింది. దాన్లో ‘ఏ జబ్బు వల్ల స్త్రీలు ఎక్కువగా మరణిస్తున్నారనే ప్రశ్నకు ‘రొమ్ము క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌’ అనే సమాధానమే వాళ్ల నుంచి వచ్చింది. కానీ నిజం ఇందుకు పూర్తిగా విరుద్ధం. రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌ల వల్ల మరణించే స్త్రీల సంఖ్య 15 నుంచి 20% ఉంటే గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోయే స్త్రీల సంఖ్య 60- 80% ఉంటోంది. ఈ సర్వేను బట్టి మహిళల్లో గుండె సమస్యల గురించిన అవగాహన తక్కువని తెలుస్తోంది. గుండెనొప్పి స్త్రీలకు రావటం అరుదనే అపోహ అందర్లోనూ ఉంది. కానీ పురుషులతో సమానంగా స్త్రీలకూ గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. స్త్రీపురుషులిద్దరూ ఒకే రకమైన జీవనశైలులు, వృత్తులు, అలవాట్లు అనుసరిస్తున్నప్పుడు ఇద్దరికీ గుండె సమస్యలు సమానంగా వచ్చే అవకాశాలున్నాయి.
 
గుండెపోటుని కనిపెట్టే యాప్‌
రాబోయే పదేళ్లలో గుండె పోటు వచ్చే అవకాశాలను గుర్తించి అప్రమత్తం చేసే యాప్స్‌ కూడా అందుబాటులోకొచ్చాయు. హార్ట్‌ రిస్క్‌ స్కోర్‌ లేదా ఎథిలోస్ల్కిరోటిక్‌ కార్డియో వాస్క్యులర్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఎఎస్‌సివిడి) అనే ఈ యాప్స్‌ను ఉపయోగించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు పూరించటం ద్వారా గుండె జబ్బు వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో శరీర బరువు, కొలెస్ట్రాల్‌ పరిమాణం, దురలవాట్లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. వీటికి మనమిచ్చే సమాధానాలనుబట్టి పదేళ్ల హార్ట్‌ రిస్క్‌ స్కోరు, ఐదేళ్ల హార్ట్‌ రిస్క్‌ స్కోరు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుసరించి జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా గుండె పోటును నియంత్రించుకోవచ్చు. 
 
 
డాక్టర్‌ మిరాజి రావు డండంగి,
సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌,
కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌.