బ్లడ్‌ షుగర్‌ ఎంతుండాలి?

టైప్‌-2 డయాబెటిస్‌ బాధితులకు హెచ్‌బీఎ1సీ 7-8% మధ్య ఉండొచ్చు

అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ సిఫారసు
ప్రస్తుత ప్రమాణాల ప్రకారం 6.5-7 శాతమే లక్ష్యం
తాజా సిఫారసులతో విభేదిస్తున్న భారత వైద్యులు

న్యూఢిల్లీ, మార్చి 20: హెచ్‌బీఏ1సీ (హిమోగ్లోబిన్‌ ఏ 1సీ)... గడచిన 3 నెలల కాలంలో సగటు చక్కెర స్థాయులను(బ్లడ్‌ సుగర్‌ లెవెల్స్‌) తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్ష. హెచ్‌బీఏ1సీ 6.5% అంతకన్నా ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్టుగా పరిగణించి చికిత్స ప్రారంభిస్తారు. ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి ఈ స్థాయులను 6.5% నుంచి 7% మధ్యలో ఉంచడమే లక్ష్యంగా వైద్యులు చికిత్స చేస్తుంటారు. ఈ లక్ష్యాన్ని 7-7.5 శాతంగా కూడా పెట్టుకోవచ్చని కొందరు పాశ్చాత్యవైద్యులు వాదిస్తున్నారు. అయితే, గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వైద్యులు 6.5-7 శాతాన్నే లక్ష్యంగా పెట్టుకుని వైద్యం చేస్తున్నారు.

తాజగా.. ఆ సగటును 7 నుంచి 8కి సవరించాలని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ‘యానల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్స్‌’ అనే జర్నల్‌లో రాసిన వ్యాసంలో సిఫారసు చేశారు. కానీ ఈ సిఫారసుతో భారతీయ వైద్యుతో ఏకీభవించట్లేదు. హెచ్‌బీఏ1సీ 7 నుంచి 8 శాతం వరకూ ఉన్నా పర్లేదనడం మధుమేహ బాధితుల ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, చికిత్స విధానాల్లో సైతం గందరగోళానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఆ సిఫారసులను పట్టించుకోవాల్సిన పని లేదని.. కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, మనదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రమాణాల మేరకే చికిత్స చేయవచ్చని మరికొందరు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో మధుమేహ చికిత్సకు సంబంధించి ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌), ఆర్‌ఎస్‌డీడీఐ (రిసెర్చ్‌ సొసైటీ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డయాబెటిస్‌ ఇన్‌ ఇండియా), ఏపీఐ (అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా) ప్రమాణాలను పాటించాలని వారు సూచిస్తున్నారు.