వ్యాయామం చేస్తే చాలదు

ఆంధ్రజ్యోతి, 17-02-2017: రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరం బరువు పెరగకుండా కాపాడుకోవచ్చని నమ్ముతున్నాం. కానీ ఈ నమ్మకం తప్పని పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. క్రమం తప్పని వ్యాయామంతో ఎన్నో ప్రయోజనాలు. ప్రాణాంతకమైన గుండెపోటు మొదలుకొని మధుమేహం, కేన్సర్‌ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. నిత్యం యవ్వనంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందిస్తుంది. అయితే బరువు నియంత్రణలో వ్యాయామం ఫలితాన్ని ఇవ్వలేదని లయోల విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. జిమ్‌లో మూడు నాలుగు గంటలు కష్టపడి కేలరీలను ఖర్చు చేసి.. హమ్మయ్య ఇక బరువు తగ్గిపోతాం అనుకోవడానికి వీల్లేదంటున్నారు. చెమటలు కక్కుతూ వ్యాయామం చేయటం వల్ల ఆకలి పెరుగుతుందని, తద్వారా జిమ్‌లో ఖర్చు చేసిన కేలరీలు ఆహారం ద్వారా తిరిగి శరీరంలోకి చేరుతాయని వర్శిటీ పరిశోధకుడు లారా ఆర్‌ డుగస్‌ వివరిస్తున్నారు. అయితే అలాగని వ్యాయామం ఇక ఎందుకులే అనుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యానికి ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి. అయితే కేవలం దీనివల్లే బరువు తగ్గుతామనుకోవడం పొరపాటు అన్నది పరిశోధకుల అభిప్రాయం.