ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి

ప్రకటించిన ఐక్య రాజ్య సమితి
వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి
జనవరి-మార్చిలో 300% పెరుగుదల
ఏటా లక్ష మంది చిన్నారుల మృత్యువాత

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 19: ప్రాణాంతక వ్యాధి అయిన తట్టు(మిజిల్స్‌) వేగంగా విస్తరిస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధిని ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు.. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనూ ఈ మహమ్మారి దాఖలాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో వ్యాధి తీవ్రత 300ు పెరిగినట్లు వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధితో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌ (యునిసెఫ్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించాయి. ఈ మహమ్మారి కారణంగా ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని తెలిపాయి. కాంగో, ఇథియోఫియా, జార్జియా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, మడగాస్కర్‌, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సూడాన్‌లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.

అవగాహన లోపం
పేద దేశాల్లో టీకాలు (వ్యాక్సినేషన్‌) పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన లోపం కారణంగా తట్టు వంటి ప్రాణాంతక అంటువ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని దేశాల్లో టీకాలు వేసేందుకు వెళ్లే వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని తెలిపింది. ప్రధానంగా టీకాలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం ఇందుకు కారణమని పేర్కొంది.
 
టీకాలతో నష్టం ఉండదు
అంటువ్యాధుల కారణంగా 2017లో 15 లక్షల మంది చిన్నారులు మరణించారని.. ఈ వ్యాధులన్నీ టీకాలతో అరికట్టగలిగేవేనని పేర్కొంది. టీకాలతో వ్యాధులు నయమవుతాయని, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండబోవని పేర్కొంటూ.. సోషల్‌ మీడియాలో ‘వ్యాక్సిన్స్‌వర్క్‌’ అనే హాష్‌ట్యాగ్‌తో ప్రచారం ప్రారంభించామని వెల్లడించింది.
 
వ్యాధి లక్షణాలు.. చికిత్స
కళ్ళు ఎర్రపడటం, నోటి లోపలి బుగ్గలలో కాప్లిక్‌ స్పాట్స్‌ కనిపించడం, దద్దుర్లు ముఖం నుంచి ప్రారంభమై కాళ్ల వరకు వ్యాపించడం, ఇవి తగ్గగానే జ్వరం, దగ్గు, మగతగా ఉండడం ఈ వ్యాధి లక్షణాలు. మిగతా వైరల్‌ జబ్బుల మాదిరిగానే తట్టుకు ప్రత్యేకించి చికిత్స లేదు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకూడదు. వైద్యుడి సూచన మేరకు జ్వరానికి పారాసిటమాల్‌ వంటి జ్వరం తగ్గించే బిళ్ళలు వాడాలి. ముందుగా టీకా తీసుకోవడం ఒక్కటే వ్యాధి నిరోధానికి పరిష్కారం.