వితంతువులు సరగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు!

సహజీవనం చేసే వారికీ అవకాశం: పార్లమెంటరీ ప్యానల్‌

13-08-2017: వితంతువులకు, సహజీవనం చేసే దంపతులకు కూడా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పొందే అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానల్‌ సూచించింది. ఇప్పటివరకు చట్టప్రకారం దంపతులైన వారికి మాత్రమే సరగసీని ఉపయోగించుకునే వీలుండేది. ఇప్పుడు ఈ సరగసీని మరింత విస్తృతం చేసే అవకాశం కలిగింది. అయితే స్వచ్ఛంద సరగసీ పేరుతో కొన్ని సందర్భాల్లో పిల్లల్ని కనే తల్లులకు ఎటువంటి పారితోషికమూ ఇవ్వకపోవడాన్ని ప్యానల్‌ వ్యతిరేకించింది. సరగసీ ద్వారా పిల్లల్ని కనే తల్లులు ప్రసవ సమయంలోనూ, తర్వాత ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారని, చాలామంది తమ బంధువుల కోసమో, దగ్గరివారి కోసమో స్వచ్ఛందంగా సరగసీ తల్లులుగా మారుతున్నారని పేర్కొంది.

సరగసీకి అంగీకరించిన తల్లులకు తప్పకుండా పారితోషికం అందేలా చూడాలని ప్రభుత్వానికి ప్యానల్‌ విజ్ఞప్తి చేసింది. అలాగే ఎన్నారైలకు, భారత సంతతికి చెందిన విదేశీయులకు కూడా భారత్‌లో సరగసీ ద్వారా పిల్లల్ని పొందడానికి అవకాశం కల్పించాలని సూచించింది. 2016 సరగసీ బిల్లు ప్రకారం విదేశీయులకు భారత్‌లో సరగసీ ద్వారా పిల్లల్ని పొందడానికి అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని సవరించాలని కేంద్రానికి సిఫారసు చేసింది ప్యానల్‌.