దంపుడు బియ్యమే శ్రీరామ రక్ష!

రక్షిత నీటితో 80% రోగాలకు చెక్‌ 
అప్పుడే రోగాలకు దూరంగా ఉండొచ్చు 
జీఏపీఐవో వైద్య నిపుణుల హెచ్చరికలు 

హైదరాబాద్‌,ఆంధ్రజ్యోతి: దంపుడు బియ్యం, జొన్నలు, సురక్షిత తాగునీరు, నడక, యోగా.. ఇవి ఉంటే చాలు.. చాలా రోగాలు దరి చేరకుండా చూసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. దంపుడు బియ్యం, జొన్నలను కనీసం వారానికి మూడు సార్లయినా తింటూ రోజూ పదివేలు అడుగులేస్తే ఆరోగ్యం బాగుంటుందని వీరు సూచిస్తున్నారు. మారిన జీవనశైలితో ప్రజలు ఇప్పుడు పూర్తిగా ఈ అలవాట్లకు దూరమయ్యారని.. ఫలితంగా చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. విదేశీయులు మన అలవాట్లు, యోగా, వ్యాయామాలను తప్పనిసరిగా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే.. మన వాళ్లు పాశ్యాత్యపోకడలను అనుసరిస్తూ.. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో గ్లోబల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(జీఏపీఐఓ) 7వ వార్షిక సదస్సు జరుగుతోంది. ఇందులో పలువురు జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం.. అమెరికాలో గ్యాస్ట్రో ఎంటారాలజిస్ట్‌, జీఏపీఐఓ అధ్యక్షుడు డాక్టర్‌ సంకు సురేందర్‌రావు, సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ ద్వారకనాథ్‌రావు, డాక్టర్‌ నవాబ్‌ షఫీ ఎల్‌ ముల్క్‌ విలేకర్లతో మాట్లాడారు. భారతీయుల్లో మారిన ఆహారపు అలవాట్లే కొంపముంచుతున్నాయని సంకు సురేందర్‌రావు తెలిపారు. పాలిష్‌ చేసిన బియ్యం, స్వీట్లు, మద్యం, జంక్‌ఫుడ్‌, ధూమపానం అలవాట్లతో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ అలవాట్లతో మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు, కేన్సర్‌ వంటి జబ్బులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహం చాలా ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పా రు. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల చిన్న వయస్సులోనే చా లా మంది దీని బారినపడుతున్నారన్నారు.
 
మరి ఏం తినాలి..! 
దంపుడు బియ్యం, జొన్నలను వారంలో 2, 3 సార్లు తింటే శరీరంలో ఇన్సులిన్‌ నియంత్రణలో ఉంటుందని సురేందర్‌రావు తెలిపారు. మధుమేహం ఉన్న వారు పాలిష్‌ చేసిన రైస్‌ జోలికి వెళ్లకపోవడం చాలా ఉత్తమమన్నారు. వీరు రోజూ దంపుడు బియ్యం, జొన్నలనే ఆహారంగా తీసుకోవాలన్నారు. ఆహారంలో బియ్యం తగ్గించి పుల్కాలు, జొన్నరొట్టెలను తీసుకుంటే గ్లూకోజ్‌ నిల్వలు నియంత్రణలో ఉంటాయన్నారు. రోజూ షుగర్‌ పరీక్షలతో ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు. 2, 3 నెలలకో సారి చేసే హెచ్‌బీఏ1సీ పరీక్షను చేయించుకుని.. దాని ద్వారానే మధుమేహంపై నిర్ధారణకు రావాలని తెలిపారు. మనం తాగే నీళ్లు సురక్షితంగా లేవని.. దీని వల్లే అనేక జబ్బులు వస్తున్నాయని తెలిపారు. సురక్షిత నీళ్లు తాగితే 80 శాతం జబ్బులను రాకుండా నియంత్రించవచ్చునని చెప్పారు. వాహనాలపై వెళ్లడం, ఇంటికి రాగానే కుర్చీలకు అతుక్కు పోయి టీవీలు చూడడం వల్ల శరీరానికి వ్యాయమం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు 10 వేల నుంచి 12 వేల అడుగులు వేస్తేనే ఆరోగ్యంగా ఉండే అవకాశాలున్నాయన్నారు. ఈ అడుగులను లెక్కించడానికి ఇప్పుడు అనేక పరికరాలు, మొబైల్‌ యాప్స్‌ వచ్చాయని చెప్పారు. ఈ పరికరాల సాయంతో ప్రతి రోజు అడుగులను లెక్కించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. స్వచ్ఛమైన నీళ్లు, మంచి వాతావరణం లేకపోవడంతో ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) జబ్బులు పెరిగాయని జీఏపీఐఓ 7వ వార్షిక సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలంపాటు ఉండే ఎలర్జీ చివరకు ఆస్తమాగా మారుతుందన్నారు. ఈ రకం జబ్బుల నియంత్రణకు గ్రామాల్లో రక్షిత నీళ్లు ఇచ్చే కార్యక్రమాలను తమ సంస్థ చేపట్టిందన్నారు. 


25 ఏళ్లకే పరీక్షలు చేయించుకోండి 

కుటుంబ నేపథ్యం ఆధారంగా ప్రతి ఒక్కరూ అవసరమున్నా లేకున్నా సందర్భానుసారం వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని తెలుసుకోవాలని వైద్యులు తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా పలు జబ్బులుంటే వారి పిల్లలు 25-30 ఏళ్ల లోపు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుటుంబంలో ఎవరికీ జబ్బులు లేకపోతే 30 ఏళ్ల నుంచి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వీటి వల్ల ముందే ఏఏ జబ్బులు వచ్చే అవకాశముందో తెలుసుకుని వాటిని కొన్నేళ్లు వాయి దా వేయొచ్చన్నారు. 35 ఏళ్లకు వచ్చే కొన్ని జబ్బులను జాగ్రత్త చర్యల తో 65 ఏళ్ల వరకు కూడా లేకుండా నియంత్రించుకోవచ్చని చెప్పారు.