రెండు గుండెల అనుసంధానం

56 ఏళ్ల వ్యక్తికి 17 ఏళ్ల బాలుడి గుండె జత

రెండు గుండెలతో కొత్త ఊపిరి

అపోలో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

హైదరాబాద్‌ సిటీ, కరీంనగర్‌ క్రైం/కోరుట్ల రూరల్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఒక ప్రాణం కాపాడేందుకు ఒక హృదయానికి మరో హృదయం తోడైన వేళ.. గుండెనొప్పితో బాధపడుతూ కొన ఊపిరితో ఉన్న ఓ వ్యక్తి ప్రాణం నిలిపారు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు. రెండు గుండెలను ఒక చోటుకు చేర్చి కొత్త ఊపిరిని ప్రసాదించారు. విజయవాడకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాడు. కాళ్లు, చేతులు, ముఖంలో వాపు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. వైద్యులు పరీక్షలు చేయగా ‘డైలేటెడ్‌ కార్డియోమయోపతి’ అనే సమస్య ఉన్నట్లు తేలింది. అతడికి గుండె మార్పిడి తప్పనిసరి. గుండె మార్పిడి చేయాలంటే ఊపిరితిత్తులను కూడా మార్చాల్సిన పరిస్థితి. తొలుత గుండెకు అసైన్డ్‌ డివైజ్‌ను ఏర్పాటు చేయాలని యోచించారు. దానికి రూ.కోటి అవుతుంది. అంత ఖర్చును అతడు భరించలేడు. 
 
గుండె మార్పిడి చేద్దామంటే వయసుకు సరిపడే గుండె లభించలేదు. చిన్న వయసు గుండె అమరిస్తే ఊపిరితిత్తులు కూడా మార్చాలి. దీంతో పాత గుండెను అలాగే ఉంచి, మరో గుండెను ఏర్పాటు చేసి ప్రాణాలు నిలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో ఓ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్‌గా ఉన్న మేకల నవీన్‌ అనే 17 ఏళ్ల బాలుడు అతడి పాలిట వరమయ్యాడు. సమాచారం అందుకున్న అపోలో ఆస్పత్రిలోని డాక్టర్‌ గోపాలకృష్ణగోఖలే.. శనివారం తెల్లవారుజామున కరీంనగర్‌కు వెళ్లి గుండెను ప్రత్యేక బాక్స్‌లో పెట్టుకుని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాధితుడి గుండె వద్ద ఎముకలు, కొన్ని నరాలను తొలగించి కొత్త గుండెకు స్థానం కల్పించారు. ఇలా పాత గుండెకు బాలుడి గుండెను అనుసంధానించి బాధితుడికి ఊపిరి పోశారు.
 
2 గంటల్లో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు..
ఈ నెల 8న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మేకల నవీన్‌(17) బైక్‌పై వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక శుక్రవారం రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. దీంతో వైద్యులు అతడి గుండెను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 56 ఏళ్ల వ్యక్తికి అమర్చాలని నిర్ణయించుకున్నారు. గుండెను హైదరాబాద్‌కు చేర్చాలి. అందుకు వైద్యులు కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం కరీంనగర్‌ ట్రాఫిక్‌ సీఐ సీతారెడ్డి, ఇతర వైద్య నిపుణులతో 6:50 గంటలకు కరీంనగర్‌ నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరి 8:50 గంటలకు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి చేరుకుని వైద్యులకు గుండెను అందజేశారు.