పిల్లల ఎదుగుదలపై థై‘రాయి’డ్‌!

దేశంలో నానాటికీ పెరుగుతున్న సమస్య
 వందలో 13 మంది చిన్నారులు బాధితులే
 బాలల్లో తగ్గుతున్న జ్ఞాపక శక్తి, ఎదుగుదల
 పల్లెల్లోనూ పెరుగుతున్న సంఖ్య..
 
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): చిన్నారుల ఎదుగుదలపై గుదిబండలా తయారవుతున్న ‘థైరాయిడ్‌ వ్యాధి’ బారినపడుతున్న వారి సంఖ్య భారత్‌లో నానాటికీ పెరుగతోంది. పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులు, పంటలపై అధికంగా క్రిమిసంహాక మందుల పిచికారీ వల్ల థైరాయిడ్‌ కోరలు చాచుకుని బాల్యంపై దెబ్బ కొడుతోంది. అయోడిన్‌ తగు మోతాదులో అందకపోవడం వల్ల ‘థైరాయిడ్‌’ గంధఇ పనితీరులో లోపాలు వస్తున్నాయి. దీంతో హార్మోన్ల విడుదల గతి తప్పి చిన్నారులల్లో ఎదుగుదల మందగించడం, జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు ఇతర వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యం గా 20 ఏళ్ల వయసు వచ్చేలోపు కనిపించాల్సిన ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత దశాబ్ద కాలంతో పోలిస్తే నేడు థైరాయిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి వంద మందిలోనూ 13 మంది చిన్నారులు థైరాయిడ్‌ లోపాలతో బాధపడుతున్నారని గత ఏడాది జరిగిన ఓ సర్వే వెల్లడించింది. దేశంలో 4.2 కోట్ల మంది థైరాయిడ్‌ బాధితులు ఉన్నారు. ఈ వ్యాధఇ ప్రస్తుతం గ్రామాలకూ విస్తరించిందని వారు పేర్కొంటున్నారు. అయితే దేశంలో 64 శాతం పల్లెల్లో పరీక్షలు చేయించుకునే సౌకర్యాలు లేవు. దీంతో పూర్తిస్థాయిలో థైరాయిడ్‌ బాధితుల వివరాలు బయటకు రావడం లేదు. అయితే థైరాయిడ్‌ ప్రాణాంతకం కానప్పటికీ ప్రమాదకమైన వ్యాధేనని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్‌ సమస్యల వల్ల కొంత మంది చిన్నారులు ఎక్కువ ఆహారం తీసుకోకపోయినా ఊబకాయులుగా తయారవడం, మరికొందరు మంచి ఆహారం తీసుకుంటున్నా బక్కపలచగానే ఉండడంతో పాటు మెదడు పనితీరు కూడా మందగించడం జరుగుతోంది.
 
పుట్టుకతోనే థైరాయిడ్‌!
పుట్టుకతోనే థైరాయిడ్‌ బారిన పడుతున్న కేసులు కూడా ఆస్పత్రుల్లో ఎక్కువగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా పుడుతూనే కామెర్ల బారిన పడే పిల్లలు ‘థైరాయిడ్‌’ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటోంది. అలాగే జన్యుపరమైన కారణాలు, తల్లికి థైరాయిడ్‌ ఉండడం వంటి కారణాల వల్ల కూడా పుట్టుకతోనే థైరాయిడ్‌ వస్తోంది. పది మందికి పుట్టుకతో థైరాయిడ్‌ వస్తే.. వారిలో ఎనిమిది మంది కామెర్లతో పుట్టిన వారు కాగా, ఇద్దరికి మాత్రమే తల్లి నుంచి సంక్రమిస్తోంది. కానీ వైద్యులు దీనిని గుర్తించకపోవడం వల్ల దీర్ఘకాలంలో పిల్లల ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. థైరాయిడ్‌ వచ్చిన పిల్లల్లో ఎదుగుదల తగ్గిపోతుంది. ఎత్తు సరిగా పెరగరు. శరీరం పొడిబారిపోతుంటుంది. జుట్టు ఊడిపోతుంది. చిన్నపనికే అలసిపోవడం, ఒళ్లు నొప్పులు రావడం, మలబద్ధకం, జ్ఞాపక శక్తి తగ్గుతగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
ఆడపిల్లలోనే ఎక్కువ!
థైరాయిడ్‌ లోపాలు మగపిల్లల కన్నా ఆడ పిల్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పుట్టుకతో థైరాయిడ్‌ బారిన పడే మగ పిల్లలు, ఆడ పిల్లల నిష్పత్తి 1:1.2 ఉండే, 9 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో ఈ నిష్పత్తి 1:1.25గా ఉంటోంది. గత ఏడాది ఎన్‌సీబీఐ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆడ పిల్లల్లో ఎదుగుదల లోపించడంతోపాటు రసజ్వల కావడం ఆలస్యమవుతోంది.
 
జీవిత కాలం మందులు వాడాల్సిందే!
పంటల ఉత్పత్తిలో పురుగు మందులు, రసాయనాల వాడకం పెరగడం, వాటిని తీసుకోవడం వల్ల చిన్నప్పటి నుంచే థైరాయిడ్‌ సమస్య వస్తోంది. పుట్టకతో కన్నా.. మధ్యలో థైరాయిడ్‌ సంక్రమిస్తున్న చిన్నారులే అధికంగా ఉంటున్నారు. థైరాయిడ్‌ ఒక్కసారి వచ్చిదంటే జీవితాంతం మందులు వాడాలి.
- డాక్టర్‌ పూర్ణ రామినేని
(ఎండోక్రైనాలజిస్ట్‌, రామినేని హాస్పిటల్‌)
 
కంగారు పడాల్సిన పనిలేదు
థైరాయిడ్‌ వచ్చిన చిన్నారుల్లో ఎదుగుదల మందగిస్తుంది. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ లక్షణాలను గుర్తించగానే వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు వాడితే సరిపోతుంది. ఇది కూడా షుగర్‌లాంటి వ్యాధి. తగ్గిందని మందులు అపలేము. మందులు వేసుకోవడం నిలిపేస్తే మళ్లీ థైరాయిడ్‌ సమస్య బయటపడుతుంది.
- డాక్టర్‌ టి.ఎస్.కార్తీక్‌
(ఎండోక్రైనాలజిస్ట్‌, వీజేఆర్‌ డయాబెటిస్‌)