ప్రైవేటు మెడికల్‌ షాపుల్లోనూ ఉచితంగా బీపీ, షుగర్‌ బిళ్లలు

అందుబాటులో 10 రకాల మందులు

ఈ-సబ్‌ సెంటర్లకు నేడు సీఎం శ్రీకారం

అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ, షుగర్‌ రోగులకు ప్రైవేటు మందుల షాపుల్లో కూడా ఉచితంగా మందులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఐసీఎంఆర్‌, కలాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా రాష్ట్రంలో సర్వే చేశాయి. ప్రైవేటు రంగంలో బీసీ, షుగర్‌ మందులకు వెచ్చించే వేలాది రూపాయలతో రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని గుర్తించాయి. మందులను ఉచితంగా అందించడం ద్వారా ఆర్థిక వెసులబాటు కలుగుతుందని ఆ సంస్థలు సిఫార్సు చేశాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ ఏపీఈఆర్‌ఎక్స్‌ యాప్‌ ద్వారా టీబీ రోగులకు ప్రైవేటు మెడికల్‌ షాపుల ద్వారా మందులు అందిస్తోంది. ఇదే యాప్‌ ద్వారా బీపీ, షుగర్‌ రోగులకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా విధివిధానాలు ఖరారు చేసింది. ఉచితంగా మందులు తీసుకోవాలని భావించే రోగులు కచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు మందుల షాపుల యజమానులకు వారానికి ఒకసారి ఆరోగ్యశాఖ బిల్లులను చెల్లిస్తుంది.
 
 
ఇందుకోసం ఆరోగ్యశాఖ 10 రకాల మందులను సూచించింది. ఆ మేరకు జీవోలో కూడా ఆ 10 రకాల మందులు, వాటి రేట్ల వివరాలను ఆరోగ్యశాఖ పొందుపరించింది. ఈ సేవలను రోగులకు అందించేందుకు ప్రయివేటు మెడికల్‌ షాపులు ఆరోగ్యశాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సేవలపై లబ్దిదారులు తమ సంతృప్తి, అసంతృప్తిని 1100 తెలియజేసుకునే అవకాశాన్ని ఆరోగ్యశాఖ కల్పిస్తోంది.
 
31 ఆస్పత్రుల సామర్థ్యం పెంపు
వివిధ జిల్లాల్లో 31 ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచుతూ శుక్రవారం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నాబార్డు సాయం తీసుకోనున్నది. విశాఖజిల్లా అరకులోని ఆస్పత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు.. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆస్పత్రిని 30 పడకల నుంచి 100 పడకలకు పెంచనున్నారు. 50 పడకలుగా పెంచే వాటిల్లో కల్యాణదుర్గం, ఏలేశ్వరం, పి.గన్నవరం, బద్వేల్‌, పోరుమామిళ్ల, నక్కపల్లి, కోటారుట్ల, కంభం, దర్శి, దోర్నాల, ఎలమంచిలి, జగ్గయ్యపేట, మైలవరం, మాచర్ల, రాపూరు, చింతపల్లి, ఆళ్లగడ్డ, గజపతినగరం, కురుపాం, చింతలపూడి తదితర ఆస్పత్రులు ఉన్నాయి.