తేలు విషంతో కేన్సర్‌ కణితుల ఆచూకీ!

న్యూఢిల్లీ, మే 11: బ్రెయిన్‌ కేన్సర్‌ కణితులను వైద్యులు పక్కాగా గుర్తించడంలో తేలు విషం సాయపడుతుందని తాజా సర్వే పేర్కొంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను న్యూరోసర్జరీ అనే జర్నల్‌లో ప్రచురించారు. బ్రెయిన్‌ కేన్సర్‌కు చికిత్స చేసే సమయంలో ప్రాణాంతక కణితులను గుర్తించడం క్లిష్టమైన పని. కీమో, రేడియోథెరపీకి ఒక పట్టాన లొంగవు. పైగా మెదడులో వేగంగా వ్యాపిస్తుంటాయి. వీటిని తొలగించడానికి వైద్యులు చాలా ఇబ్బంది పడుతుంటారు. తేలు విషంలోని ఒక ప్రత్యేక లక్షణం కారణంగా కేన్సర్‌ కణితిని సులువుగా గుర్తించవచ్చునని, ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ వేయగానే ఇతర కణితుల మాదిరే స్పష్టంగా కనిపిస్తాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆడమ్‌ మామేలక్‌ తెలిపారు.