రగిలిపోతే రాచపుండే

ప్రతికూల భావనలతో కేన్సర్‌ ప్రమాదం
క్షమాగుణంతో ముప్పు తప్పించుకోవచ్చు
మనోక్లేశంతో హానికారక హార్మోన్లు.. అసాధారణంగా పెరిగే కార్టిసాల్‌, అడ్రినలిన్‌
ఫలితంగా శరీరంలో రక్షక కణాల తగ్గుదల.. కేన్సర్‌ పరిశోధకుల వెల్లడి

ఎంతగానో నమ్మినవారు వెన్నుపోటు పొడిస్తే.. మనసు రగిలిపోతుంది. జీవితమంతా వారిని ద్వేషిస్తాం. కనిపించినప్పుడల్లా కోపంతో భగ్గున మండిపడతాం. మనసంతా అవే ఆలోచనలు వెంటాడుతాయి. ..ఇలా మీకూ జరిగిందా? జరుగుతోందా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఇలాంటి ప్రతికూల భావనల వల్ల శరీరంలో కేన్సర్‌ కణాలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. క్షమాగుణం అలవరచుకుంటే ఆరోగ్యపరంగా అద్భుతాలు జరుగుతాయని కూడా వారు సూచిస్తున్నారు.

వాషింగ్టన్‌, జూలై 10: మీకు బాధ, కోపం కలిగించే చేదు సంఘటనల గురించి ఎంత తలుచుకుంటే ఆరోగ్యపరంగా ముప్పు అంత ఎక్కువని.. ఆలోచనల సంఘర్షణ మెదడునే కాక శరీరాన్నీ ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ‘కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ ఆఫ్‌ అమెరికా’కు చెందిన సర్జరీ విభాగం చీఫ్‌ డాక్టర్‌ స్టీవెన్‌ స్టాండిఫోర్డ్‌. హానిచేసినవారిని సైతం క్షమించి, ఆ సంఘటనను మరచిపోయి ముందుకు సాగితే ఆ భారం దిగిపోయి ప్రశాంతంగా ఉంటామట.
 
ఎందుకిలా?
కారణమేదైనాగానీ.. గతంలో జరిగిన ఘటనల వల్ల కోపం, ఆందోళన, అయోమయం వంటి భావనలకు తరచూ గురవుతుంటే ఆ ప్రభావం శరీరంపై పడుతుందని స్టీవెన్‌ స్టాండిఫోర్డ్‌ అంటున్నారు. ఆయన చెబుతున్నదాని ప్రకారం.. ప్రతికూల భావనల వల్ల అధైర్యం కలిగి శరీరం బలహీనమవుతుంది. ఫలితంగా శరీరంలో హానికారక కార్టిసాల్‌, అడ్రినలిన్‌ స్థాయులు అసాధారణంగా పెరుగుతాయి. దాంతో శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవుల పనిపట్టే మంచి కణాల సంఖ్య తగ్గి.. కేన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. ‘ద ఫర్‌గివ్‌నెస్‌ ప్రాజెక్ట్‌’ పుస్తక రచయిత డాక్టర్‌ మైకేల్‌ బారీదీ ఇదే మాట. ఆయన సర్వే చేసిన కేన్సర్‌ బాధితుల్లో 61% మందికి ఈ క్షమాగుణానికి సంబంధించిన సమస్యలున్నాయని ఆయన తెలిపారు. ‘‘కోపం, ద్వేషం వంటి ప్రతికూల భావనలు గూడుకట్టుకుపోవడం వల్ల అది దీర్ఘకాలిక చింత(క్రానిక్‌ యాంగ్జైటీ)కు దారితీస్తుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్‌, అడ్రినలిన్‌ పెరుగుతాయి. మన శరీరంలో కేన్సర్‌ కణాలపై పోరాడే సహజ కిల్లర్‌ కణాల సంఖ్యను అవి తగ్గించేస్తాయి’’ అని ఆయన వివరించారు. కాబట్టి ఒకే సమస్య గురించి పదేపదే తలచుకుంటూ మనసులో రగిలిపోవడం శరీరానికి మంచిది కాదు. మన బాధకు కారణమైనవారిని గురించి, ఆ సంఘటన గురించి మరచిపోవడానికి ప్రయత్నించడం, అందుకు అవసరమైన వేరే మార్గాలను వెతుక్కోవడం వల్ల రోగాల ముప్పు తగ్గుతుంది.
 
ఎలా క్షమించాలి?
మనకు ఎంత నష్టం కలిగించినవారినైనా, చెడుచేసినవారినైనా.. క్షమించేంత సహనాన్ని పెంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. కానీ, ప్రయత్నిస్తే సాధ్యమే. ఇందుకు మానసిక వైద్యనిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
క్షమిస్తున్నామంటే అవతలివారి తప్పులను అంగీకరిస్తున్నామనో.. మనకు ఆ సంఘటనవల్ల ఎలాంటి బాధా లేదనో కాదు. వాస్తవాన్ని అంగీకరించడం అంతే. ఆత్మీయులు మరణించినప్పుడు ఆ బాధతోనే రోజులతరబడి కుంగిపోం కదా! చనిపోయిన కొద్దిసేపటి దాకా తీవ్రదుఃఖంలో మునిగిపోతాం. ఆ తర్వాత.. జరగాల్సినదాని గురించి ఆలోచిస్తాం. కొన్ని రోజులు గడిచే సరికి బాధ తీవ్రత తగ్గుతుంది. కోపమైనా అంతే. ‘గతం గతః’ అనే నానుడిని గుర్తుతెచ్చుకుంటే చాలు. జరిగిందాన్ని మార్చలేమన్న విషయం అర్థమవుతుంది. ఆ విషయాన్ని అక్కడే వదిలిపెట్టి జరగాల్సిందాని గురించి ఆలోచించడం అలవాటవుతుంది. అంతిమంగా అది మన ఆరోగ్యానికే మేలు చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
మీరు క్షమించినట్టు అవతలివారికి చెప్పాల్సిన పని లేదు. అది అసలు వారికి సంబంధించిన విషయం కాదు. మీ ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన విషయం అని తెలుసుకోవాలి. మన మేలు కోసం మనం ఆ మాత్రం చేసుకోలేమా?
మీ కోపానికి/మనస్తాపానికి కారణమైన సంఘటనను బాధితుడుగా కాక.. ప్రేక్షకుడిగా ప్రశాంతంగా పరిశీలించండి. దానివల్ల మీ బలాలు, బలహీనతలు ఏమిటో మీకు తెలిసే అవకాశం ఉంటుంది. అవతలి వారి దృష్టికోణం నుంచి ఆలోచిస్తే.. కొన్ని సందర్భాల్లో మనదే తప్పని కూడా అనిపించవచ్చు. అప్పుడు మనసుకు తగిలిన గాయం మానే అవకాశం ఎక్కువ. ఒకవేళ వారిదే తప్పయినా సరే.. అది వారి బలహీనతగా భావించి ముందుకు సాగడానికి ప్రయత్నించాలి (గతం గతః).
ఆలోచనల ద్వారా అవతలి మనిషిని క్షమించలేమని అనిపించినప్పుడు.. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, మిమ్మల్ని బాధపెట్టిన వారిని ఉద్దేశించి ఒక లేఖ రాయండి. మొత్తం మీ ఆలోచనలు, భావనలు, కోపం, బాధ అన్నింటినీ అందులో వ్యక్తపరచండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ఆ లేఖ వారికి ఇవ్వడం కోసం కాదు. కేవలం మీ బాధను పోగొట్టుకోవడానికే. చాలా సందర్భాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ‘రాత’ మనసులో బాధను పోగొడుతుంది.

‘క్షమ’ అలవాటుగా మారాలి

క్షమాగుణం అనేది ఏదో ఒక్క సంఘటన విషయంలో చూపడంతో సరిపెట్టకూడదు. దాన్ని అలవాటుగా మార్చుకోవాలని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలా క్షమించే అలవాటు ఉన్నవారికి నిద్ర చక్కగా పడుతుందని, అలసట తక్కువగా ఉంటుందని, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా వారికి తక్కువగా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. కోపంతో రగిలిపోతూ ప్రతికూల భావనలు పెంచుకునేవారిలో హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఎక్కువని ఒక పరిశోధనలో తేలింది. క్షమాగుణం ఉన్నవారిలో గుండె ఆరోగ్యం బాగుంటుందని రుజువైంది.