‘ఆయుర్వేదం’ అమలుకు స్విట్జర్లాండ్‌ కమిటీ

ఆయుర్వేద వైద్యం, మందుల ఆమోదానికి నిబంధనలు
బెర్న్‌, సెప్టెంబరు 10: ఆయుర్వేద వైద్యాన్ని అధికారికంగా గుర్తించిన తొలి పాశ్చాత్య దేశం స్విట్జర్లాండ్‌.. ఆయుర్వేద వైద్యులు, మందుల ఆమోదానికి నిబంధనల్ని రూపొందించనుంది. ఇందుకోసం ఓ కమిటీని నియమించింది. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం 2015లోనే ఆయుర్వేద మందుల్ని, థెరపీని అధికారికంగా గుర్తించింది. దేశంలో ఈ వైద్యానికి ఆదరణ కూడా ఎక్కువగానే ఉంది. అయితే దేశంలో ఇది అడుగుపెట్టిన తొలిరోజుల్లో పలు హోటళ్లు కూడా ఆయుర్వేదంతో కూడిన ఆహారం ఇస్తామంటూ ప్రకటించాయని, ఆయుర్వేదంలో సరైన అర్హత లేకుండానే డాక్టర్లు ఆయుర్వేద వైద్యం చేసేవారని, వీటిని అరికట్టేందుకే దీనికి అధికారిక విధానాన్ని రూపొందిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వాస్తవానికి దేశంలో ప్రత్యామ్నాయ వైద్య విధానం కావాలని స్విట్జర్లాండ్‌ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఈ మేరకు రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్‌ను చేర్చేందుకు 2009లో ఆమోదం తెలిపారు.