నిమ్స్‌ రోగులపై సమ్మె పోటు

వైద్యం అందక విలవిలలాడుతున్న రోగులు
ఒక వైపు రెసిడెంట్‌ డాక్టర్లు... మరో వైపు నర్సుల ఆందోళన

హైదరాబాద్, 12-09-2018: రెసిడెంట్‌ డాక్టర్ల ఆందోళన రోగులకు ప్రాణ సంకటంగా మారింది. కొత్తగా నియమించిన డీన్‌ను తొలగించాలని నాలుగు రోజులుగా రెసిడెంట్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి ఆందోళన చెపట్టడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం రోజునే నిమ్స్‌‌లో పదమూడు మంది రోగులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదని రోగుల సహాయకులు చెబుతున్నారు. రెసిడెంట్‌ డాక్టర్ల సమ్మెకు తోడు మంగళవారం నుంచి నర్సులు కూడా ఆందోళన చేపట్టడంతో రోగులు మరిన్ని అవస్థలు పడుతున్నారు.

ర్యాలీలు, ధర్నాలు...
ప్రతిష్ఠాత్మకమైన నిమ్స్‌ ఆస్పత్రి మంగళవారం ధర్నాలు, ర్యాలీలలో దద్దరిల్లింది. డీన్ ను తొలగించాలని రెసిడెంట్‌ డాకర్లు, వేతనాలు పెంచాలంటూ ఇంటర్నీస్‌(నిమ్స్‌లో సేవలు చేసే నర్సులు) ఆందోళన బాట పట్టారు. దీంతో రోగులకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు సమస్య జఠిలమైంది. ఉదయం 8 గంటల సమయంలో నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైద్యు లు స్వాస్థ్య ద్వారం వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం నిమ్స్‌ డైరెక్టర్‌ సమావేశ మందిరానికి వెళ్లి సమస్యను వివరిం చారు. ఇందుకు స్పందించిన డైరెక్టర్‌ ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు, రానున్న రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పినట్లు ఆర్‌డీఏ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గౌతమ్‌ తెలిపారు.
 
ఇంటర్నీస్‌ ఆందోళన...
నిమ్స్‌ ఆస్పత్రిలో ఏళ్ల తరబడి సేవలు చేస్తు న్న తమకు కనీస గౌరవం కరువైందని నిమ్స్‌ ఇంటర్నీస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పనికి తగినట్లుగా వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ డైరెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. స్పందించిన డైరె క్టర్‌ గుర్తింపు కార్డులను నాలుగు రోజుల్లో అందజేస్తామని, ఏరియర్స్‌, వేతనాలు పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
 
రోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు...
నిమ్స్‌ ఆస్పత్రిలో సేవలకు లోటులేదు. సేవలు పుష్క లంగా అందిస్తున్నాం. ఆందోళనలు జరిగినప్పటికీ రోగుల కు అందించే సేవలను తక్కువ కానివ్వం. నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వందల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. రోగులు వ్యాధి ముదిరే వరకు పలు ఆస్పత్రులు తిరిగి చివరి దశలో మా ఆస్పత్రికి వస్తారు. అటువంటి వారిని రక్షించేందుకు సైతం చర్య లు తీసుకుంటున్నాం. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన వారు మృతి చెందడం సహజమే.
- డాక్టర్‌ మనోహర్‌, నిమ్స్‌ డైరెక్టర్‌