స్టెంట్ల ధరల్లో కేంద్రం సవరణలు

మెటల్‌ స్టెంట్‌ ధరలో రూ.280 పెంపు

డ్రగ్‌ స్టెంట్లలో రూ.2290 తగ్గింపు.. నేటి నుంచి అమలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దాదాపు ఏడాది తర్వాత కరోనరీ స్టెంట్ల ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. గత ఏడాదిలో దాదాపు 85 శాతం ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బేర్‌ మెటల్‌ స్టెంట్‌(బీఎంఎస్‌) ధరను రూ.7,400 నుంచి రూ.7,680కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్‌(డీఈఎస్‌) ధరను రూ.30,180 నుంచి రూ.27,890కు తగ్గించింది. సవరించిన ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు నేషనల్‌ ఫార్మాసూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎపీపీఏ) సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని బ్రాండ్ల స్టెంట్లకు ఈ సవరణ ధరలను వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఎంఆర్‌పీ ధరలపై కంపెనీలు జీఎస్టీ వేసుకోవచ్చని.. కాకపోతే మరే ఇతర చార్జీలు వేయడానికి వీల్లేదని తెలిపింది. ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు సైతం సవరించిన ధరలతోనే స్టెంట్లను అమ్మాలని.. డీపీసీవో-2013 నిబంధనలు పాటించి రోగుల పేరు మీదే బిల్లు ఇవ్వాలని పేర్కొంది.. స్టెంట్ల ధరల ముద్రణ క్రమంలో సరాఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించింది. సవరించిన ఈ ధరలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు లేదా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసే వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.