కడుపులో కత్తెర...నిమ్స్‌లో దారుణం

హైదరాబాద్, 09-02-2019: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నిమ్స్ వైద్యులు ఓ రోగి ప్రాణంతో చెలగాటం ఆడారు. రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపై కత్తెరని కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. మూడు నెలల క్రితం మహేశ్వరికి నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గకుండా వస్తుండటంతో ఆందోళన చెందిన మహేశ్వరి తిరిగి ఆస్పత్రికి చేరుకుని విషయాన్ని వైద్యులకు తెలియజేసింది. ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూశారు. దాంతో మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన విషయం బయటపడింది. విషయం తెలిసిన రోగి బంధువులు వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిమ్స్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.