మూడు నెలల శిశువుకు అరుదైన శస్త్రచికిత్స

బెంగళూరు, 07-06-2019: నరాలు పనిచేయక పలు అవయవాలు పనిచేయని స్థితికి చేరిన మూడునెలల చిన్నారి వైష్ణవికి మల్లేశ్వరంలోని మణిపాల్‌ ఆసుపత్రిలో అద్భుతమైన చికిత్సలు జరిపించారు. ఈ మేరకు న్యూరాల జిస్టు భరత్‌ కడాడి గురువారం చిన్నారికి అందించిన శస్త్ర చికిత్సల గురించి మీడియాకు వివరించారు. ఇదో అరుదైన వ్యాధి అని బ్రేకియల్‌ ప్లెక్సస్‌ బర్త్‌ పాల్సీగా పిలుస్తారన్నారు. చిన్నారి జననంలోనే కొన్ని నరాలు పనిచేయని కారణంగా అవయవాలు చచ్చుబడి పోతాయన్నారు.
 
ఇటువంటి జబ్బుతో బాధపడుతున్న చిన్నారి వైష్ణవికు 5గంటల పాటు సుధీర్ఘంగా ఆపరేషన్‌ చేశామన్నారు. చికిత్సల తర్వాత చిన్నారికి చేయి సాధారణంగా పనిచేస్తోందన్నారు. నవజాత శిశువులలో వచ్చే అరుదైన వ్యాధులను గుర్తించుకుని వైద్యుల సలహాలు పాటించాలన్నారు. వేయి మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇటువంటి జబ్బు సోకే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఆపరేషన్‌ ద్వారా విజయవంతమైన చిన్నారులను పరిచయం చేశారు. ఆసుపత్రి డైరక్టర్‌ ప్రమోద్‌ కుందర్‌తో పాటు చిన్నారి తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వివరించారు.