ఉచితంగా ప్రైవేటు అంబులెన్స్‌ సేవలు

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అంబులెన్స్‌ సేవలను మరింత చేరువ చేసే దిశగా ‘అంబులెన్స్‌ ఉబరైజేషన్‌’కు శ్రీకారం చుట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈ విధానంలో రాష్ట్ర ప్రజలు ఉచితం గా ప్రైవేటు అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఇందుకోసం ‘ఏపీ108’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దాంట్లో వ్యక్తి ఉన్న ప్రాంతం నుంచి పట్టణాల్లో 40కి.మీ. పరిధిలో, పల్లెల్లో 80కి.మీ., గిరిజన ప్రాంతాల్లో 100కి.మీ. పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌లకు నోటిఫికేషన్లు వెళ్తాయని, అత్యంత సమీపంలో ఉన్న వాహనం డ్రైవరు స్పందిస్తారని వివరించారు. యాప్‌ను ఆపరేట్‌ చేస్తుండగానే 108 కాల్‌సెంటర్‌కు ఆటోమేటిగ్గా ఫోన్‌ వెళ్తుందని, ఈ మొత్తం ప్రక్రియను 108 సర్వీస్‌ ప్రొవైడర్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు.