అధిక ఒత్తిడితో గర్బధారణ సమస్యలు

సన్నగిల్లుతున్న అండాల విడుదల శక్తి

హైదరాబాద్‌, 10-08-2018: పాశ్చాత్య మహిళలతో పోలిస్తే భారతీయ మహిళల్లో అండాలను విడుదల చేసే శక్తి త్వరగా మందగిస్తోందని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీయుల కంటే మన దేశ మహిళలు నాలుగైదు సంవత్సరాల కంటే ముందుగానే అండాలను విడుదల చేసే శక్తిని కోల్పోతున్నారన్నారు. గురువారం మాదాపూర్‌లోని బర్త్‌రైట్‌ బై రెయిన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘ఓవేరియన్ ఏజింగ్‌’ అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. భారతీయ మహిళల జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పుల వల్లే అండాలను విడుదల చేసే శక్తి సన్నగిల్లుతుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. అధిక ఒత్తిడితో కూడుకున్న పనులు, పొగ, ఆల్కాహాల్‌, ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడకం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఇన్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ప్రీతిరెడ్డి వివరించారు. మహిళలు గర్భదారణలో తరచూ విఫలమవుతుంటే వెంటనే వైద్యులను సంప్రందించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ రత్న దుర్వాసుల సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు ఎల్‌.జయంతిరెడ్డి, ఎం.విద్యారంగారావు, వరలక్ష్మి, రేణుక, పల్లవి తదితరులు పాల్గొన్నారు.