బాబుతో నేడు పవన్‌ భేటీ?

రాష్ట్రపతి ఎన్నిక ఒత్తిడితో వాయిదా పడితే మరో రోజు

ఉద్ధానం సమస్యపైనే చర్చ.. రానున్న విదేశీ బృందం
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలు.. ఆ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఓటింగ్‌ను సీఎం పర్యవేక్షించాల్సి ఉంది. ఈ ఒత్తిడి నేపథ్యంలో వీరి భేటీ జరక్కపోతే.. 2-3 రోజుల్లోనే సమావేశమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వ విద్యాలయాన్ని సందర్శించిన పవన్‌ కల్యాణ్‌ అక్కడి వైద్యులను కలిసినప్పుడు.. వారిని ఉద్ధానం సమస్య పరిశీలనకు రావాలని ఆహ్వానించారు. వారు దానికి అంగీకరించారు. ఆ వైద్య బృందం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రితోనూ సమావేశం కానుంది. ఈ సమస్యపై చొరవ తీసుకున్నందున ఈ భేటీకి పవన్‌నూ ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ఆయనకు వర్తమానం కూడా పంపారు.