పక్కా ట్రాన్స్‌‘ప్లాన్‌’..టేషన్‌!

కిడ్నీల కోసమే ‘దానం’ నాటకం

సింహపురి ఆస్పత్రి రిజిస్ర్టేషన్‌, ఐదుగురు డాక్టర్ల లైసెన్స్‌ రద్దు
తక్షణం క్రిమినల్‌ చర్యల కోసం పూనం మాలకొండయ్య ఆదేశం
దీనిపై ఎంసీఐకి లేఖ రాయాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు ఉత్తర్వులు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక
విచారణ కమిటీ వేసిన కలెక్టర్‌
బ్రెయిన్‌డెడ్‌కు ముందే బేరాలు
బలవంతంగా భార్యకి కౌన్సెలింగ్‌

తేల్చిన కమిటీ..చర్యలు మొదలు

నెల్లూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): కిడ్నీల కోసం నిరుపేద గిరిజనుడి కుటుంబాన్ని సింహపురి ఆస్పత్రి మోసగించిన దుర్మార్గంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఆస్పత్రి రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎంసీఐకి తక్షణమే లేఖ రాయాలని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య.. ఆ శాఖ డైరెక్టర్‌కు మెమో జారీ చేశారు. అలాగే, దోషులుగా తేలిన ఐదుగురు డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారి లైసెన్సులు రద్దు చేయాలని కూడా ఆదేశాలిచ్చారు. వారు ఇచ్చే వివరణను పరిశీలించిన తరువాత, ఎన్టీఆర్‌ వైద్యసేవా నెట్‌వర్క్‌ నుంచి సింహపురి ఆస్పత్రిని తొలగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. సింహపురి ఆస్పత్రి వ్యవహారంపై తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. పూనం మాలకొండయ్య బుధవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన ‘దానమా.. దుర్మార్గమా?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వార్తను ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ధ్రువీకరించింది.

 
జరిగింది ఇదీ..
టూవీలర్‌ గుద్దిన ఏకొల్లు శ్రీనివాసులును సింహపురి ఆస్పత్రికి ఆయన భార్య తీసుకొచ్చారు. ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించకముందే.. రెండు కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు పనికొస్తాయని నెఫ్రాలజిస్ట్‌ మాధవ్‌ దేశాయ్‌ గుర్తించారు. ఈ మేరకు ఆయన పేషెంట్‌ కేస్‌ షీట్‌లో రాశారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు దేశాయ్‌ ధ్రువీకరించగా... ఆ రోజు రాత్రి 8 గంటలకు శ్రీనివాసులును బ్రెయిన్‌డెడ్‌గా ఆస్పత్రి ప్రకటించింది. చట్టం ప్రకారం బ్రెయిన్‌డెడ్‌ అయిన తర్వాతే అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు పనికొస్తాయో లేవో పరీక్షించాల్సి ఉంటుంది. కాబట్టి, డాక్టర్‌ దేశాయ్‌, ఆస్పత్రి యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరించిందని నివేదికలో పేర్కొన్నారు.
 
బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించటం కంటే రెండున్నర గంటల ముందు, జీవన్‌దాన్‌లో నమోదు చేసుకోవడానికి మూడు గంటల ముందే కిడ్నీల అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటగిరికి చెందిన నర్రా వరలక్ష్మి అనే మహిళ సింహపురి ఆస్పత్రిలో చేరింది.
వరలక్ష్మి ఏప్రిల్‌ 19వ తేదీ సాయంత్రం 5:26 గంటలకు సింహపురిలో చేరగా, అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీనివాసులు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని ఆ ఆస్పత్రి నిర్ధారించింది. 19వ తేదీ రాత్రి 8:30 గంటలకు జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నారు. ఆ ప్రతిపాదనను జీవన్‌ దాన్‌ అదేరోజు రాత్రి 8:46 గంటలకు ఆమోదించింది. అయితే వరలక్ష్మికి జీవన్‌దాన్‌ నుంచి కిడ్నీ కేటాయింపు జరగడం కంటే చాలా ముందుగానే ఆమె ఆస్పత్రిలో చేరిందని, కిడ్నీ సిద్ధంగా ఉందని సింహపురి ఆస్పత్రి వర్గాలు సమాచారం అందించిన తర్వాతే ఆమె ఆస్పత్రిలో చేరిందని, ఈ వ్యవహారంలో ఆ ఆస్పత్రి వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.
 
మొత్తం ఆస్పత్రి బిల్లును మాఫీ చేసేందుకు అవయవాలు దానం చేయాలంటూ చనిపోయిన వ్యక్తి భార్య అరుణతో బేరసారాలకు దిగడం, అవయవదానం చేసే దిశగా అమెకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా చట్టాలను ఈ ఆస్పత్రి ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 18వ తేదీ ఉదయం 1:34 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 1:49 గంటల వరకు శ్రీనివాసులుకు చికిత్స చేసినందుకు రూ.1,28,354 బిల్లు వేశారు. ఆ మొత్తాన్ని మాఫీ చేశారు.
 
కానీ, జీవో నంబర్‌ 184లోని 14వ నిబంధన ప్రకారం పేషెంట్‌ చనిపోయినప్పటి నుంచి డిశ్చార్జ్‌ వరకు అయ్యే బిల్లు మాత్రమే మాఫీ చేయాలి. అంటే 19వ తేదీ సాయంత్రం 8 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 1:49 గంటల వరకు అయిన బిల్లును మాఫీ చేయాలి. కానీ, సింహపురి ఆస్పత్రి బిల్లు మొత్తం మాఫీ చేసింది. శ్రీనివాసులుకు భార్య అరుణకు ఆస్పత్రి వర్గాలు రూ.20,000 అందజేశాయి. దీనికి సంబంధించి ఆస్పత్రి వద్ద బిల్లు ఉందని నివేదికలో పేర్కొన్నారు. శ్రీనివాసులును ద్విచక్ర వాహనంతో యాక్సిడెంట్‌ చేసిన షేక్‌ ఖాదర్‌ భాషా ఆ ఆస్పత్రి వద్ద రూ.20,000 డిపాజిట్‌ చేశారు. ఆ డిపాజిట్‌ డబ్బునే శ్రీనివాసులు భార్యకు అందజేశారు.
 
శ్రీనివాసులు డెడ్‌బాడీ నుంచి గుండె, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు జీవన్‌దాన్‌కు దానం చేశారు. దీనికి సంబంధించి.. న్యూరో సర్జన్‌ డాక్టర్‌ జీ. వెంకటేశ్వర ప్రసన్న, ఎమర్జెన్సీ ఫిజీషియన్‌ డాక్టర్‌ ప్రణీత్‌ గంగినేని, క్రిటికల్‌ కేర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ వి.నరేశ్‌, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పి. దీక్షాంతి నారాయణ్‌, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ మాధవ్‌ దేశాయ్‌లను తమ నివేదికలో దోషులుగా తేల్చారు. వీరు టీవోహెచ్‌ఏ (ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ అండ్‌ టిష్యూ రూల్స్‌) చట్టంలోని సెక్షన్‌ 18, అదే చట్టంలోని రూల్‌ 20; జీవో నంబర్‌ 184ను ఉల్లంఘించారని పేర్కొన్నారు.
 
మరో విచారణకు ఆదేశాలు
కిడ్నీల దానం వ్యవహారంలో అక్రమంగా జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకునేందుకు మరో విచారణ జరపాలని నెల్లూరు కలెక్టర్‌కు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. సింహపురి హాస్పటల్స్‌ అథారిటీపై చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రిపై, డాక్టర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనలో పాత్ర ఉన్న ఐదుగురు డాక్టర్లపై చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విచారణ బృందంలో నెల్లూరు డీఎం అండ్‌ హెచ్‌వో, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఏసీఎ్‌సఆర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, జిల్లా ఆస్పత్రి సేవల విభాగం కోఆర్డినేటర్‌, కావలి సబ్‌కలెక్టర్‌ సభ్యులుగా ఉన్నారు.