ఎయిమ్స్‌ ‘ఓపీ’కి రోగుల క్యూ

16 విభాగాల్లో వైద్య సేవలు .. రోజువారీ షెడ్యూల్‌ విడుదల

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఓపీ(అవుట్‌ పేషెంట్స్‌) సేవల కోసం రోగులు క్యూ కడుతున్నారు. ఇక్కడ మార్చి 1నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొదటినెలలో కేవలం 35 మంది మాత్రమే రాగా, ఇప్పుడు ఈ సంఖ్య భారీగా పెరిగింది. మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గుంటూరు, విజయవాడ నుంచి కూడా రోగులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 80నుంచి 100మంది ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో వైద్యసేవలను కూడా పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి శనివారం వరకూ 16విభాగాల ద్వారా వైద్య సేవలు అందించనున్నారు. దీనికి సంబంధించి రోజువారీ షెడ్యూల్‌తో పాటు ఓపీ రూమ్‌ నంబర్ల వివరాలను విడుదల చేశారు. పెద్దలకు అవసరమైన వ్యాక్సిన్లు ఏడు రోజులూ, పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ప్రతి బుధవారం వేస్తారు. ఈ ఓపీ సేవలను అందరూ వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.