193 జన్యు వ్యాధులకు ఒకే డీఎన్‌ఏ పరీక్ష

చిన్నపిల్లలకు రక్షగా ‘సీమా4నాటాలిస్‌’
 
న్యూయార్క్‌, ఫిబ్రవరి 12: పిల్లలకు భవిష్యత్తులో జన్యు వ్యాధులు వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. కానీ, ఏయే పరీక్షలు చేయించాలి? ఎంత ఖర్చవుతుంది? కచ్చితత్వం ఉంటుందా? అని ఇలా ఎన్నో ప్రశ్నలు మెదళ్లను తొలుస్తుంటాయి. ఈ సమస్యకు తాము అభివృద్ధి చేసిన డీఎన్‌ఏ పరీక్ష పరిష్కారం చూపుతుందని అమెరికాకు చెందిన జన్యు పరీక్షల కంపెనీ ‘సీమా4’ చెబుతోంది.
 
కేవలం చీక్‌ స్వాబ్‌తో పిల్లల చెంపకు ఉన్న లాలాజలాన్ని సేకరించి మూర్ఛ, కండరాల క్షీణత, కేన్సర్‌.. ఇలా 193 జన్యు రోగాలను ముందే పసిగట్టవచ్చని అంటోంది. ‘సీమా4నాటాలిస్‌’ అనే ఈ జన్యు పరీక్షతో అప్పుడే పుట్టినవారి నుంచి పదేళ్లలోపు పిల్లలకు వచ్చే రోగాలను గుర్తించవచ్చని వెల్లడించారు. వ్యాధులు వచ్చే అవకాశం ఉందని గుర్తిస్తే, దాని పర్యవసానాన్ని అడ్డుకునేలా వైద్యం అందించేందుకు ఈ పరీక్ష దోహదం చేస్తుందని తెలిపారు. పరీక్ష కిట్‌ ధర రూ.42వేలు అని, చీక్‌ స్వాబ్‌తో సేకరించిన లాలాజలాన్ని ఈ కిట్‌లో భద్రపరిచి తమకు పంపిస్తే రోగ నిర్ధారణ చేస్తామని పేర్కొన్నారు.
 
మీ జన్యు సమాచారాన్ని అమ్ముకోవచ్చు!
మీ జన్యు సమాచారం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా? ‘జన్యు సమాచారం మాకు అందజేస్తే డబ్బు ఇవ్వడానికి మేం సిద్ధం!’ అంటోంది అమెరికాకు చెందిన ‘నెబ్యూలా జీనోమిక్స్‌’ అనే స్టార్టప్‌ సంస్థ. పలు వంశపారంపర్యంగా వచ్చే రోగాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు, ఫార్మా కంపెనీలకు డీఎన్‌ఏ సమాచారం అవసరం. అయితే, పరీక్షలు నిర్వహించేందుకు జన్యువుల సమాచారం దొరకడం లేదు. ఆ సమస్య నుంచి గట్టెక్కించేందుకు దాదాపు రూ.65వేలకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సంస్థ చెబుతోంది. అయితే, దీనికోసం జరిగే లావాదేవీ క్రిప్టో కరెన్సీ ద్వారానే సుమా! ఒకవేళ జన్యు సమాచారం అమ్మితే, దానికి సంబంధించిన పూర్తి హక్కులు కంపెనీకే చెందుతాయి.