కిడ్నీ అమ్మితే కోటి ఇస్తా

ఆన్‌లైన్‌లో అమాయకులకు వ్యక్తి వల
ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో వసూళ్లు
ఓ బాధితుడికి 20లక్షలు కుచ్చుటోపీ
పట్టుకున్న రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కిడ్నీ అమ్మితే కోటి ఇస్తానని నమ్మబలికితే?రెండు కిడ్నీల్లో ఒకటి ఇచ్చేసినా ఒక కిడ్నీతో ఇబ్బంది లేకుండా బతికేయొచ్చని.. పైగా దండి గా డబ్బుకి డబ్బూ వస్తుందని ఆశపడకుండా ఉంటారా? ఇలా డబ్బు బాగా అవసరమైన వ్యక్తుల అమాయకత్వాన్నే సొమ్ము చేసుకోవాలని అతడు ఆన్‌లైన్‌ వేదికగా మోసాలకు తెరతీశాడు. ‘కిడ్నీ డోనర్స్‌, బయ్యర్స్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్‌’లో ‘కిడ్నీలు కొనబడును.. అమ్మబడును’ అంటూ ఆర్భాటంగా ప్రకటనలూ గుప్పించాడు. తమిళనాడు మధురైకి చెందిన సూర్య శివరాం అలియాస్‌ శివ అనే సైబర్‌ నేరగాడిదీ దందా! ఇతడిని రాచకొండ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాల మేరకు వెబ్‌సైట్‌ ప్రకటనల్లో తనను కిడ్నీ ఫెడరేషన్‌ ఏజెంట్‌గా శివరాం ప్రకటించుకునేవాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆర్థిక ఇబ్బందులతో ఓ కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కిడ్నీ బయ్యర్ల కోసం నెట్‌లో గాలిస్తూ కిడ్నీ డోనర్స్‌, బయ్యర్స్‌.నెట్‌ వర్క్‌ వెబ్‌సైట్‌ను చూశాడు. అందులో శివరాం ఉంచిన ప్రకటన అతడిని ఆకర్షించింది.

 
ఫోన్‌ ద్వారా అతడిని సంప్రదించి తన పరిస్థితిని వివరించాడు. అతడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న శివరాం.. ‘రూ. కోటికి పైగా డబ్బు ఇప్పిస్తాను’ అని నమ్మించాడు. ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ. 15వేలు తన ఖాతాలో జమ చేయించుకొని.. మెడికల్‌ ఎగ్జామిన్‌ ఫీజు కింద 50 శాతం నగదు డిపాజిట్‌ చేస్తేనే కిడ్నీ తీసుకుంటామని, కిడ్నీ ఆపరేషన్‌ పూర్తయ్యాక అవి తిరిగి చెల్లిస్తామని నమ్మించాడు. దీంతో ఇంట్లో ఉన్న బంగారం కుదవబెట్టి మరీ అతని ఖాతాలో విడతలవారీగా రూ.20లక్షల దాకా వేశాడు. ఆ తర్వాత శివరాం.. తన ఫోన్‌ నంబరును మార్చాడు. ఆన్‌లైన్‌లోనూ తన వివరాలు లేకుండా చేశాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. లబోదిబోమంటూ రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
 
సీపీ ఆదేశాలమేరకు ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో పోలీసుల బృందం రంగంలోకి దిగింది. తాము కిడ్నీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి శివరాంను ట్రాప్‌ చేశారు. డబ్బులు తీసుకోవడానికి హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ ప్రాంతానికి రప్పించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శివరాం తన నేరాన్ని అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితుడి నుంచి మొబైల్‌ ఫోన్‌ను, నకిలీ కిడ్నీ ఫెడరేషన్‌కు సంబంఽధించిన ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.