వైద్యంలో సంక్షోభం

 

భారీగా ఖాళీలు.. పైగా డిప్యుటేషన్లు
డాక్టర్ల కొరతతో ఆపరేషన్లు వాయిదా
ప్రొఫెసర్ల నుంచి అటెండర్ల దాకా 4,167 ఖాళీలు.. డిప్యుటేషన్‌పై 40%
డిప్యుటేషన్లు రద్దు చేయండి: కలెక్టర్లు
 
హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అసలే కుప్పలు తెప్పలుగా ఉన్న ఉద్యోగ ఖాళీలు.. ఆపై కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇబ్బడిముబ్బడిగా చేపట్టిన డిప్యుటేషన్లు... ఫలితంగా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో నెలకొన్న సిబ్బంది కొరత... దీంతో వైద్యసేవలు అందక రోగుల అగచాట్లు! ఇదీ తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితి! ఉద్యోగ నియామకాలు, డిప్యుటేషన్ల పరంగా రాష్ట్ర వైద్యశాఖలో తీవ్ర ఆయోమయం నెలకొంది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనకు ముందు, తర్వాత తాత్కాలిక సర్దుబాటు కోసం చేసిన డిప్యుటేషన్ల అంశం వివాదంగా మారింది. ఈ డిప్యుటేషన్లను రద్దు చేసి, తమ జిల్లా సిబ్బందిని మళ్లీ జిల్లాకే పంపాలంటూ పలువురు కలెక్టర్లు వైద్యశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే భారీగా ఖాళీలున్న పరిస్థితుల్లో డిప్యుటేషన్లతో కొన్ని ఆస్పత్రుల్లో కనీస వైద్య సేవలను కూడా కొనసాగించే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో 13,933 ఉద్యోగాలకు 4,167 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి.
 
అంటే.. మొత్తం పోస్టుల్లో 30 శాతం పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో ఉన్నతస్థాయి వైద్యులు, ప్రొఫెసర్ల నుంచి కింది స్థాయి ఏఎనఎంలు, నర్సులు, అటెండర్ల వరకు ఉన్నాయి. ముఖ్యమైన ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు కూడా చేయలేని స్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఆపరేషన్లను వాయిదా వేసిన సందర్భాలున్నాయి. జిల్లాల ఏర్పాటుకు మునుపే ఆస్పత్రుల అవసరా ల మేరకు జిల్లా పరిధిలోనే కొందరిని డిప్యుటేషన లో ఇతర ప్రాంతాలకు పంపారు. ఉదాహరణకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ యూనిట్ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు. కాలేజీ ఏర్పాటు, ఆస్పత్రి ఆధునికీకరణకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా ఇతర ప్రాంతాల నుంచి కొందరు ప్రొఫెసర్లను, వైద్యులను డిప్యుటేషనపై అక్కడ నియమించారు.
 
ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల ఆస్పత్రుల అవసరాల మేరకు ఇలాంటి కొన్ని డిప్యూటేషన్లను చేశారు. ఇక కొత్త జిల్లాలు ఏర్పడటంతో ఆ జిల్లాల అవసరాల మేరకు మరింత మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించారు. ఇలా వైద్యశాఖలో సుమారు 40 శాతం వైద్యులు, ఇతర సిబ్బంది డిప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో తీవ్ర వైద్యుల కొరత నెలకొంది. ముఖ్యంగా జిల్లాస్థాయి ఆస్పత్రులు లేని కొత్త జిల్లాల్లో శస్త్రచికిత్సలను కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ వైద్యులను తిరిగి వెనక్కి పంపిస్తే, ఏరియా ఆస్పత్రులను కొంత వరకైనా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్లు ప్రభు త్వ దృష్టికి తీసుకెళుతున్నా రు. ఈ మేర కు డిప్యుటేషన్లను రద్దు చేయా లంటూ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు లేఖ లు రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
  
నిపుణులైన వైద్యులు ఏరీ? 
రాష్ట్ర వైద్యశాఖలో కేటాయించిన పోస్టులకు సరిపడా ఉద్యోగులు లేరు. ప్రధానంగా నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా ఉం ది. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో మొత్తం 1,368 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టులు ఉంటే.. 413 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 3,584 స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఉంటే.. వీటిలో 1,109 ఖాళీగా ఉన్నా యి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన, వైద్య విధాన పరిషతలోనూ భారీగా ఖాళీలు పేరుకుపోయాయి. కాగా 2,108 వైద్య పోస్టులను భర్తీ చేస్తామని ఏడాది కాలంగా ప్రభుత్వం చెబు తున్నా... ఇప్పటికీ ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలు కాలేదు.
 
ఉద్యోగాల పోస్టులు, ఖాళీల వివరాలు
ఆదిలాబాద్‌(485-177), అసిఫాబాద్‌ (478-179), భూపాలపల్లి (534-175), గద్వాల్‌(293-117), హైదరాబాద్‌(777-298), జగిత్యాల(403-147), జనగాం(32-9), కామారెడ్డి(684-211), కరీంనగర్‌(611-62), ఖమ్మం (809-237), మహబూబాబాద్‌(487-131), మంచిర్యాల (429-93), మెదక్‌(757-181), మేడ్చల్‌(387-73), నాగర్‌కర్నూల్‌(774-262), నల్లగొండ(1019-412), నిర్మల్‌(389-27), నిజామాబాద్‌(1274-588), సంగారెడ్డిూ(747-334), సిద్దిపేట(267-95), సిరిసిల్ల(449-100), సూర్యాపేట(616-208), వనపర్తి(388-110), వరంగల్‌(395-80), వరంగల్‌ రూరల్‌(402-78), యాదగిరి(47-17).