వెన్నుతడితే వెనక్కి చూడం

ఆంధ్రజ్యోతి, 17-02-2017: నీలోఫర్‌కి ఉన్న సామాజిక స్పృహ నుంచి ‘నీలోఫర్‌ ఆస్పత్రి’ ఏర్పడింది. దశాబ్దాలుగా ఎందరో నిరుపేద తల్లులకు పురుడు పోసింది ఈ వైద్యాలయం. అంతటి చరిత్ర ఉన్న ఈ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు డాక్టర్‌ శైలజ. ఈ ఘనత పొందిన తొలి మహిళా గైనకాలజిస్ట్‌ కూడా ఈమే. ఈ సందర్భంగా ‘నవ్య’ ఆమెను పలకరించింది.

 
పదవి అనేది ఒక సేవ చేసే అవకాశంగా భావిస్తాను నేను. నీలోఫర్‌ ఆస్పత్రి చరిత్రలో ఒడుదొడుకులు ఎన్నో ఉన్నాయి. అయినా.. నేటికీ హైదరాబాద్‌లో తల్లీబిడ్డలకు మెరుగైన వైద్యం ఎక్కడ దొరుకుతుందని అడిగితే.. అందరూ చెప్పే సమాధానం నీలోఫర్‌ ఆస్పత్రి అనే. ఇదే ఒరవడిని భవిష్యత్తులో కొనసాగిస్తాను.

ఇల్లంతా లైబ్రరీ 

నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. మా నాన్న ఎన్‌వీవీ ప్రసాదరావుగారు బోర్డర్‌ వర్క్స్‌లో పనిచేసేవారు. రాష్ట్ర శాఖలో కూడా ఉద్యోగం చేశారు. అమ్మ సావిత్రి. వాళ్లకి ఏకైక సంతానం నేను. నాన్న ఉద్యోగ రీత్యా.. నేను మా తాతయ్య వాళ్లింట్లో పెరిగాను. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అంతా రోసరీ కాన్వెంట్‌ హైస్కూల్‌లో సాగింది. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలని అనుకునేదాన్ని. నా ఆలోచనకు తగ్గట్టే మా బంధువర్గంలో డాక్టర్ల సంఖ్య ఎక్కువే. వారి ఇన్‌స్పిరేషన్‌, మా నాన్న ప్రోత్సాహంతో డాక్టర్‌ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివాను. తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో పీజీ చేశాను. ఎంబీబీఎస్‌ తర్వాత నా వివాహం అయింది. మావారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ పాండురంగారావు. సక్సెస్‌ఫుల్‌ డాక్టర్‌గా ఆయనకు మంచి పేరుంది. మా ఇద్దరి జీవితాలు వైద్యంతో ముడిపడి ఉండటం వల్ల ఒకరి ఇబ్బందులు ఒకరికి తెలుసు. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగాం. నేను, మావారు ఎప్పుడూ చదువుతూనే ఉండేవాళ్లం. మా అమ్మాయి స్కూల్‌లో ఇచ్చిన హోమ్‌వర్క్స్‌ చేస్తుంటే.. మేం మా పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్లం. మా ఇల్లంతా పుస్తకాలతో ఒక లైబ్రరీలా ఉండేది.
 
ఉన్నంతలో హాయిగా.. 
ప్రభుత్వ వైద్యురాలిగా నా కెరీర్‌ మొదలైంది. ఇల్లు, పిల్లలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగం.. ఇన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగాను. ఈ విషయంలో మహిళలు మహారాణులనే చెప్పాలి. ఎన్ని పనులున్నా చేయగల శక్తి ఆడవాళ్లలో ఉంటుంది. కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహిస్తే చాలు అద్భుతాలు సాధించగలరు ఆడవాళ్లు. నా విషయంలో మావారు నాకు అండగా నిలిచారు. నేనెప్పుడూ సంపాదన కోసం వెంపర్లాడలేదు. అన్నిటికన్నా జీవితం ముఖ్యం. అందమైన జీవితాన్ని సంపాదన కోసం బిజీ చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే నేను ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ వైద్యురాలిగానే కొనసాగుతున్నాను. సంపాదనలో లభించని తృప్తి ఇక్కడ నిరుపేదలకు వైద్యం చేసినపుడు కలుగుతోంది. ఉన్నంతలో హాయిగా బతకడం తెలుసు. ఇప్పటికీ అలాగే జీవితం సాగిస్తున్నాను.
 
అంతా ప్రశాంతమే 
సమాజంలో మగవాళ్లకు ఉన్నంత వెసులుబాటు మహిళలకు లేదన్నది వాస్తవం. ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. అవకాశం కల్పిస్తే ఆడవారూ ఏదైనా సాధించగలరనే సత్యాన్ని గుర్తిస్తున్నారు. ఉద్యోగ జీవితంలో కూడా మహిళగా నేను ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు లేవు. ప్రశాంత చిత్తంతో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రశాతంగా కనిపిస్తుంది. ఏ ఉద్యోగికి అయినా పని చేసే దగ్గరే సగం కన్నా ఎక్కువ జీవితం గడిచిపోతుంది. ఆ తరువాత సమయం ఇంట్లో... ఈ రెండు చోట్లా ప్రశాంతంగా ఉండగలిగితే జీవితమంతా ప్రశాంతమే కదా. ఈ సూత్రాన్ని నేను బాగా విశ్వసించాను. దానినే పాటిస్తాను.
 
ఆధ్యాత్మిక మార్గం 
గృహిణిగా, వైద్య అధికారిగా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. వీటిని అధిగమించడానికి నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను. గుళ్లు, గోపురాల చుట్టూ తిరిగితేనే భక్తి అనుకోవద్దు. అది మానసికంగా రావాల్సిన పరివర్తన. ఆ స్థితిని పొందగలిగితే ఒత్తిళ్లన్నీ పటాపంచలు అవుతాయి. నేననే కాదు.. ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో ఒత్తిడి సహజం. అయితే ఇల్లు, పిల్లలు అనే కాకుండా.. తమకంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి. తమకి ఇష్టమైన జీవితాన్ని ఆస్వాదించాలి. ఇష్టమైన సంగీతం వినాలి. ఫర్‌గివ్‌ అండ్‌ ఫర్‌గెట్‌ పాలసీని పెంపొందించుకోవాలి. అప్పుడే మనసు నిశ్చలంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే మార్పులను స్వాగతించే మనస్తత్వం పెరుగుతుంది. 
కోరుకున్న మార్పు రాకపోతే నిరాశకు లోనవడం, ఊహించని మార్పు ఎదురైతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం సాధారణమైపోయింది. ఆధ్యాత్మిక సాధన కొరవడటం వల్లే ఈ అశక్తత మనుషుల్లో పెరిగిపోయింది. ఆధ్యాత్మిక బలం ప్రోది చేసుకోగలిగితే.. ఈ మార్పులను ఆస్వాదించే గుణం పెరుగుతుంది. ఏదైనా ఎదుర్కోగలనన్న నమ్మకం కలుగుతుంది.
-త్రిగుళ్ల నాగరాజు, ఫోటో: హరిప్రేమ్‌
 
ఒక వైద్య అధికారిణిగా నీలోఫర్‌ ఆస్పత్రిలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇక్కడికి వచ్చే తల్లులకు, పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలి. ఆస్పత్రిలో అధునాతన టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాం. కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుంది. అడ్మినిసే్ట్రషన్‌ సరళంగా ఉంటేనే మెరుగైన సేవలు అందుతాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాను.
 
మాకు ఒక అమ్మాయి లక్ష్మీ లావణ్య, అబ్బాయి శ్రీ యోగేష్‌. మా పిల్లలిద్దరూ డాక్టర్లు కారు. అమ్మాయి అమెరికాలో ఉంటోంది. అబ్బాయి టెక్నాలజీ రూట్లో ఉన్నాడు. మా అభిప్రాయాలు వారిపై రుద్దే ప్రయత్నం చేయలేదు. ఏం చదువుకోవాలో వారికే వదిలేశాం. ‘‘మీ వల్ల సమాజానికి మేలు జరగకపోయినా ఫర్వాలేదు.. కీడు మాత్రం చేయకూడద’’ని చెబుతుంటాం. వాళ్లూ అలాగే మసులుకుంటున్నారు.